బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (13:48 IST)

మా అన్నయ్య నేర్పిన సంస్కారం అదే... ఎవరు హిట్ కొట్టిన ఆనందమే : పవన్ కళ్యాణ్

తమ అన్నయ్య మాకు మంచి సంస్కారం నేర్పారని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే మనదిగా భావిస్తున్న తెలుగు చిత్రపరిశ్రమలో ఎవరు హిట్ కొట్టినా తమకు ఆనందమేనని చెప్పారు. అన్నయ్య చిరంజీవి నటించిన "సైరా నరసింహా రెడ్డి" మూవీ ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా పవన్ ప్రసంగం ఆయన మాటల్లోనే, 'బాల్యంలో నేను అన్నయ్య చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన గొప్పతనం చూసి ఆశ్చర్యపోయేవాడిని. అన్నయ్య సినిమాలు రికార్డులు సృష్టించడాన్ని ఎంతో ఆస్వాదించేవాడిని. అయితే ఎన్టీరామారావు గారు నటించిన "విశ్వామిత్ర" చిత్రం రావడంతో అన్ని రికార్డులు బద్దలయ్యాయి. దాన్నిబట్టి ఆనాడు తాను అర్థం చేసుకున్నదేంటంటే, రికార్డులు శాశ్వతం కాదని, ఓ వ్యక్తి అనుభవమే శాశ్వతం అని, దాన్ని ఎవరూ కొట్టేయలేరని తెలుసుకున్నాను. అందుకే చిరంజీవిగారంటే తనకు అత్యంత గౌరవం. 
 
పైగా, ఎవరెన్ని విజయాలు సాధించినా, ఆ విజయాలను తాము కూడా ఆస్వాదిస్తాం. అన్నయ్య చిరంజీవి తమకు నేర్పించిన సంస్కారం ఇదే. రాజమౌళి విజయాలు సాధించినా తమకు ఆనందమేనని, ఆయన రికార్డులు బద్దలుకొట్టినా తాము కూడా సంతోషిస్తాం. అలాంటి సందర్భాల్లో తాము అసూయపడబోమని, ఇంకో పది మంది బాగుపడతారన్న భావనతో మరింత ఆనందిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 
 
కాగా, ఈ వేడుక వేదికపై పవన్ సీరియస్‌గా ప్రసంగిస్తున్న సమయంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఓ అభిమాని రాకెట్ లాగా వేదికపైకి దూసుకొచ్చి పవన్‌కు పాదాభివందనం చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ అభిమానిని బలవంతంగా అక్కడ్నించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
 
వెంటనే పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని... 'మీరందరూ వెళ్లిపోండి' అంటూ హిందీలో చెప్పారు. అయినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది వినిపించుకోలేదు. దీంతో గట్టిగా హిందీలో "ఆప్ లోగ్ చలే జాయియే భాయ్", "చలీయే ఆప్" అంటూ అరవడంతో సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి తగ్గారు. దాంతో ఆ అభిమాని పవన్‌ను ఆనందంతో హత్తుకుని మురిసిపోయాడు. అనంతరం పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించాడు.