బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది నటులు ప్రభుత్వానికి అమ్ముుడు పోయారంటూ ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దేశంలోని తాజా రాజకీయాలపై బాలీవుడ్ నటుల్లో ఏ ఒక్కరూ స్పందించడం లేదన్నారు. దీనికి కారణం హిందీ చిత్రపరిశ్రమలోని చాలా మంది నటులు ప్రభుత్వానికి అమ్ముడు పోయారని, అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడరన్నారు.
ప్రభుత్వం ఏదైనా సరే.. చర్చలను అణచివేస్తుంది. మరో విషయం ఏమిటంటే... ఒక విషయంపై మాట్లాడాలా? లేదా అన్నది నటీనటులపైనే ఆధారపడి వుంటుందన్నారు. సినిమాల మేకింగ్ విషయంలో వారికంటూ ఒక అవగాహన ఉండాలి. ఆ సినిమాను విడుదల చేయడానికి కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఎందుకు మాట్లాడరంటే ఇండస్ట్రీలో సగం మంది నటీనటులు అమ్ముడు పోయారు.
మరికొంతమందికి మాట్లాడే ధైర్యం లేదు. నా మిత్రుడు ఒకరు ఇదే విషయాన్ని చెప్పాడు. ప్రకాష్ రాజ్ నీకు ధైర్యం ఉంది. నువ్వు మాట్లాడగలవు. కానీ, నాకు అంత ధైర్యం లేదు. అన్నారు. అతడి పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ, ఒక్క విషయాన్ని చెప్పగలను నేరాలు చేసిన వారినైనా చరిత్ర వదిలేస్తుందేమోకానీ మౌనంగా కూర్చున్నవారిని మాత్రం విడిచిపెట్టదు. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిందే అని ప్రకాశ్ రాజ్ అన్నారు.