శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2025 (17:41 IST)

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

Telangana Film Chamber General Secretary JVR
Telangana Film Chamber General Secretary JVR
పెద్ద  సినిమాలకు టికెట్ రేట్లు పెంచమని  చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..మాట తప్పడం సరికాదని అన్నారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ జేవీఆర్. బడా సినిమాలకు టికెట్ రేట్లు పెంచమని గతంలో ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని జేవీఆర్  కోరారు. పెద్ద సినిమాలకు  టికెట్ రేట్లు పెంచడం వల్ల చిన్న చిత్రాలకు అన్యాయం జరుగుతోందని, థియేటర్స్ కు రావాలంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడుతోందని జేవీఆర్ అన్నారు.

ప్రభుత్వం సినీ పరిశ్రమతో జరిపిన చర్చల్లో టీఎఫ్ సీసీకి, సీనియర్ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి ఆహ్వానం లేకపోవడం విచారకరం అని జేవీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.
 
టీఎఫ్ సీసీ జనరల్ సెక్రటరీ జేవీఆర్ మాట్లాడుతూ - పెద్ద సినిమాలకు టికెట్ రేట్ల పెంపు ఉండదని తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచారు. ప్రభుత్వం మాట తప్పిందనే విషయం ప్రజల్లోకి వెళ్లింది. ప్రభుత్వం ఇప్పటికైనా మాట మీద నిలబడాలి. పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచకుండా చర్యలు  చేపట్టాలి. నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని, గతంలో కాంగ్రెస్ పార్టీలో  పనిచేశాను. కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తూనే ఈ మాటలు చెబుతున్నాను. 
 
ఇటీవల సినిమా ఇండస్ట్రీతో ప్రభుత్వం జరిపిన చర్చల సందర్భంగా తెలంగాణ వారి ప్రాతినిధ్యం కనిపించలేదు. టీఎఫ్ సీసీ లో 35 వేల మంది కార్మికులు, 16 వేల మంది సభ్యులు, వెయ్యి మంది నిర్మాతలు  ఉన్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి నిర్మాతగా సినిమా పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన 40 సినిమాలు నిర్మించారు. ఇప్పటికీ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాంటి రామకృష్ణ గౌడ్ గారిని ప్రభుత్వం సినీ పరిశ్రమతో జరిపిన చర్చలకు పిలవకపోవడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం టీఎఫ్ సీసీని గుర్తించారు. 
 
మా నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలి. దిల్ రాజు ను ఎఫ్ డీసీ ఛైర్మన్ గా నియమించారు. ఆయన పరిశ్రమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవడంలో కృషి చేయడం లేదు. సినిమా పరిశ్రమలో లక్షమంది కార్మికులు ఉన్నారు. వారందరినీ వదిలి వన్ మేన్ ఆర్మీలా దిల్ రాజును మాత్రమే చర్చలకు పిలవడం సరికాదు. టీఎఫ్ సీసీ నుంచి ఎవరికీ చర్చలకు ఆహ్వనం అందకపోవడం విచారకరం. ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి, చిన్న సినిమాలు బతికించేందుకు గతంలో సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంటకరెడ్డి గారు, సీఎం రేవంత్ గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతున్నా అన్నారు.