సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (18:24 IST)

డైరెక్టర్‌గా ఎస్.జె.సూర్య విఫలం... నటుడుగా వరుస ఆఫర్లు

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విజయ్, అజిత్ వంటి పెద్ద పెద్ద స్టార్‌లతో సినిమాలు తీసి పేరు సంపాదించుకున్న దర్శకుడు ఎస్.జే సూర్య. కొన్ని సినిమాలు తీసినప్పటికీ తీసినవన్నీ క్రేజీ ప్రాజెక్టులే. కొద్ది కాలంలోనే వేగంగా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు అంతే వేగంగా పేరు పోగొట్టుకున్నాడు. "కొమరం పులి" వంటి కొన్ని చెత్త సినిమాల కారణంగా ఆయన సంపాదించుకున్న పేరు నీటిపాలైంది. 
 
ఆ తర్వాత దర్శకత్వ శాఖలో రాణించలేక డీలాపడిపోయాడు. అదేసమయంలో ఆయనకు నటుడుగా అవకాశాలు వచ్చాయి. తనకే సాధ్యమైన ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకుసాగిపోతున్నాడు. సినీ అభిమానుల హృదయంలో బలమైన ముద్ర వేశాడు. దక్షిణాన డిమాండ్ ఉన్న నటులలో అతను కూడా ఒకడైపోయాడు. తాను డైరెక్ట్ చేసిన హీరోలు మహేష్, విజయ్‌ల సినిమాలలో విలన్‌గా నటించడం మరో ఎత్తు. మహేష్‌తో ‘స్పైడర్’లో, విజయ్‌తో ‘మెర్శల్’లో అతను నటించిన సంగతి తెలిసిందే. 
 
ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టు అతడిని వరించింది. రజినీకాంత్ సినిమాలో విలన్‌గా చేయబోతున్నాడు. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నిర్మితమౌతున్న సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నాడు. మరో పక్క బిగ్ బితో నటించబోతున్నాడు సూర్య. అమితాబ్ తమిళంతో తీస్తున్న తొలి చిత్రం ఇది. అంత పెద్ద హీరోల సరసన విలనిజం పండించడం అంత సాధారణ విషయం కాదు. 
 
అజిత్‌తో కూడా మరో సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నాడు. ఇలా ఎస్.జే.సూర్య ఇపుడు వరుస సినీ అవకాశాలతో దూసుకెళుతున్నాడు. ఇలాగే కొనసాగితే రెగ్యులర్ ఆర్టిస్ట్‌ల పరిస్థితి ఏమిటని కామెంట్‌లు వస్తున్నాయి. సూర్య దర్శకత్వాన్ని పక్కనబెట్టి నటనకే అంకితమైనట్లు కనిపిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి కూడా.