శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (09:34 IST)

సోనూ సూద్‌కు ఎముక లేని చేయి : చిన్నా గుండె ఆపరేషన్ కోసం సాయం

బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోమారు తనలోని పెద్దమనసు చాటుకున్నారు. ఓ చిన్నారి గుండె ఆపరేషన్ కోసం అయిన ఆస్పత్రి ఖర్చులన్నీ చెల్లించి.. తన చేతికి ఎముకేలేదని మరోమారు నిరూపించారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 15 నెలల వయసున్న చిన్నారి ఆపరేషన్‌కు అవసరమైన రూ. 4.50 లక్షల ఆసుపత్రి బిల్లు చెల్లించాడు.
 
కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని మునుకుళ్లకు చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతుల కుమార్తె వర్షిత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. పాపను బతికించుకోవాలంటే ఆపరేషన్ చేయాల్సిందేనని వైద్యులు చెప్పారు. 
 
పేద కుటుంబం కావడంతో ఆపరేషన్‌కు అవసరమైన డబ్బులు సమకూర్చుకోవడం వారికి తలకుమించిన భారంగా మారింది. దీంతో జనవిజ్ఞాన వేదిక ప్రతినిధుల ద్వారా చిన్నారి పరిస్థితిని నటుడు సోనూ సూద్ దృష్టికి తీసుకెళ్లారు.
 
వెంటనే స్పందించిన ఆయన ముంబై ఆసుపత్రిలో చిన్నారి ఆపరేషన్‌కు అవసరమైన రూ.4.50 లక్షల సాయం అందించాడు. చికిత్స అనంతరం చిన్నారి కోలుకోవడంతో వెంకటేశ్వర్లు దంపతులు సోమవారం స్వగ్రామానికి చేరుకున్నారు. తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టారంటూ ఈ సందర్భంగా సోనూ సూద్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.