దసరా సెలవులు.. "సైరా"కు బ్రహ్మరథం... తెలుగు రాష్ట్రాల్లో కనకవర్షం (video)
మొట్టమొదటి తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం గాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఇక వసూళ్ళ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలలో దసరా సెలవులు కారణంగా బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురుస్తుంది. 'సైరా' తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సుమారు రూ.85 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఒక మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు విశ్లేషకులు తెలిపారు. రానున్న రోజులలో ఈ చిత్రం మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయం అని చెబుతున్నారు.
ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, ఇందులో అమితాబ్ బచ్చన్, అనుష్క, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే హీరో రామ్ చరణ్ నిర్మాతగా మారి రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటివరకు ఈ చిత్రం మొత్తం 38.76 కోట్ల రూపాయల గ్రాస్ షేర్ను వసూలు చేసిందట. ఇవి రికార్డుస్థాయి వసూళ్లేనని అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో ఇది తొలి చారిత్రక చిత్రం కావడం, ఈ భారీ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరించడం, దర్శకుడిగా తనకి వచ్చిన అవకాశాన్ని సురేందర్ రెడ్డి ఛాలెంజింగ్‌గా తీసుకోవడం, భారీ తారాగణం ఈ కథలో భాగస్వాములు కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇన్ని రకాల ప్రత్యేకతల కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లతో దూసుకుపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.