విదేశాల్లో "సైరా" దూకుడు... డాలర్ల వర్షం
మెగాస్టార్ చిరంజీవి నటించిన "సైరా నరసింహా రెడ్డి" చిత్రం బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం స్వదేశంలోనేకాకుండా, విదేశాల్లో సైతం సూపర్ టాక్‌తో దూసుకెళుతోంది.
ముఖ్యంగా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సైరా దూకుడు ప్రదర్శిస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో మంచి వసూళ్లను సాధిస్తుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం అమెరికాలో మంగళవారం 308 లొకేషన్స్‌లో ప్రదర్శించిన ప్రీమియర్స్‌లో 8,57,765 డాలర్ల(6.16 కోట్ల రూపాయలు)ను రాబట్టినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా ఆస్ట్రేలియాలోనూ ఉదయం 11 గంటల వరకు 39 లొకేషన్స్‌లో 1,89,237 ఆస్ట్రేలియన్ డాలర్స్‌ను సాధించినట్లు పేర్కొంటున్నారు. బుధవారం ఒక్క రోజే ఈ చిత్రం అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్‌ను క్రాస్ చేసినట్టు సమాచారం.
కాగా, ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటించగా, అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుధీప్, విజయ్ సేతుపతి వంటి అగ్ర నటీనటులు ఈ చిత్రంలో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.