తమిళ చిత్ర పరిశ్రమకు వున్న ధైర్యం తెలుగు చిత్ర పరిశ్రమ లేదా?
ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు తీసుకున్న సాహసేపేతమైన నిర్ణయాలు హీరోలపై గుదిబండగా మారాయి. ఒక సినిమాను పూర్తి చేశాక మరో సినిమాకు అడ్వాన్స్ తీసుకుని చేయాలనీ తాము చేసిన నిర్ణయాలు ఖచ్చితంగా అమలు కావాలని నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళీ పేర్కొనడం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తెలుగులో కొందరు నిర్మాతలు సమర్థించినా మన దగ్గర ఇలాంటివి అమలు చేయడం చాలా కష్టమేనని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తెలియజేస్తున్నారు.
గతంలోనే తాము నిరాహారదీక్షలు చేసి చిన్న సినిమాల సమస్యలకు పోరాడాం. కరోనా టైంలో కూడా హీరోల పారితోషికాలు తగ్గించుకోమని చెప్పాం. కానీ దాన్ని అగ్ర నిర్మాతలెవ్వరూ స్పందించలేదు. హీరోలు మాత్రం పైకి అవసరమైతే మా పారితోషికాలు తగ్గించుకుంటామని విక్టరీ వెంకటేష్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఇది డిమాండ్ అండ్ సప్లయి వ్యవహారంగా అగ్ర నిర్మాతలు తేల్చిచెప్పారు.
ఇంకోవైపు ఓ నిర్మాత ఓ హీరోకు అడ్వాన్స్ ఇస్తే, దానికి మించి మరో నిర్మాత అడ్వాన్స్ ఇవ్వడం తెలుగు పరిశ్రమలో మామూలేనని, దానిపై ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని కొందరు నిర్మాతలు వాపోతున్నారు. ఏది ఏమైనా తమిళ పరిశ్రమకూ తెలుగు పరిశ్రమకు చాలా వ్యత్యాసం వుందనీ, గతంలో ప్రకాష్ రాజ్ డేట్స్ విషయంలో సహకరించకపోవడం, దానితో ఫిలింఛాంబర్ వద్ద ధన్నాకు దిగడం జరిగిందనీ, అప్పుడు అగ్ర నిర్మాత దిల్ రాజే ప్రకాష్ రాజ్ ను వెనకేసుకువచ్చారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా తమిళ నిర్మాతలు చేసిన ధైర్యం తెలుగు నిర్మాతలు చేయరని స్పష్టం చేస్తున్నారు. దీనిపై మరింత క్లారిటీగా రావాలంటే తెలుగు నిర్మాతలు త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారని తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతోందో.