'సీనియర్ హీరోయిన్'పై కన్నేసిన 'డియర్ కామ్రేడ్'
టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సంచలనం సృష్టించాడు. 'గీత గోవిందం' చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఆ తర్వాత టాక్సీవాలాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆలరించలేక పోయాడు. ఇపుడు డియర్ కామ్రేడ్ చిత్రంతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఈ యేడాది ఆఖరు నాటికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
అయితే 'నోటా' సినిమాతో తమిళ ప్రేక్షకులని పలుకరించిన విజయ్ ఇప్పుడు కోలీవుడ్‌లో మరో సినిమా చేసేందుకు సన్నద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత ఎస్‌ఆర్ ప్రభు, కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయనున్నాడట.
ఇందులో హీరోగా విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తుండగా, హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార అనే టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ని తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఒకవేళ ఈ వార్తే కనుక నిజమైతే అతి తక్కువ టైంలో నయనతారతో జతకట్టే ఛాన్స్ విజయ్ దేవరకొండకి రావడం గొప్ప విశేషమే మరి.