మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 మే 2020 (15:14 IST)

రాజకీయాల్లోకి ప్రణీత.. కమలం పార్టీవైపు పవన్ హీరోయిన్? (video)

సినిమా రంగంలోని పలువురు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా హీరోయిన్లు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఛాన్సులు దొరికితే సరేకానీ.. అవకాశాలు లేకపోతే ఇక పెళ్లి చేసుకోవడం లేదంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం చేస్తున్నారు. ఇలా ఎందరో హీరోహీరోయిన్లు జాతీయ, ప్రాంతీయ రాజకీయాల్లో రాణిస్తున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ రాజకీయాల్లోకి ప్రవేశించబోతోందని టాలీవుడ్ వర్గాల సమాచారం.
 
ఆమె మరెవరో కాదు.. ప్రణీత. అత్తారింటికి దారేది సినిమాలో బాపు బొమ్మగా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ సినిమాకు తర్వాత మరికొన్ని సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. ప్రస్తుతం అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వుండటంతో రాజకీయాల వైపు దృష్టి సారించాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కానీ కన్నడ సినిమాలతో ప్రణీత బిజీగా వుంది. ఇక కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రపంచమంతా హిందు మతం వైపు చూస్తుందంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి. లాక్ డౌన్ తరుణంలో ప్రణీత ప్రజలకు సేవచేసేందుకు ముందుకువచ్చింది. ఇంకా హిందూ మతంకు సంబంధించిన ప్రణీత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరే అవకాశం వున్నట్లు సమాచారం. 
 
మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా చేతులతో నమస్కారం చేయడం.. ఇంట్లోకి వెళ్లేముందు చేతులు కాళ్ళు కడుక్కోవడం లాంటివన్నీ ప్రపంచం తమకు తెలియకుండానే భారతీయ సంస్కృతిని ప్రమోట్ చేస్తున్నాయంటూ ప్రణీత గతంలో అభిప్రాయపడింది. ఇంకా ఈమె మాట్లాడుతూ హిందూ మతం ఒక మతం కాదని.. అది ఒక సాంప్రదాయం అని కామెంట్ చేసింది.
 
పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి మన సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేసుకుంటున్నామంటూ ప్రణీత చెప్పింది. సాయం చేయడం కూడా అలవాటుగా మారాలంటుంది ప్రణీత. అయితే ఇతరులకు సాయం చేసిన విషయానికి, రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదేమోనని సినీ పండితులు అంటున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ప్రణీత చేసిన సాయం.. తన ఇమేజ్ పెంచుకునేందుకే అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. 
 
కానీ తెలియని రోగాలను కూడా తెచ్చుకుంటున్నామని.. పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటే ఇలాంటివేం రావని ప్రణీత చెప్పుకొచ్చింది. ప్రధాని మోదీ దేశం కోసమే పాటు పడుతున్నాడని.. ఆయన చెప్పింది చేయాలని కోరుకుంటుంది. ఇన్ని రోజులు మాట్లాడకుండా కేవలం లాక్‌డౌన్ సమయంలో మాట్లాడటంతో కమలం పార్టీ వైపు అడుగులు పడుతున్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రణీత రాజకీయాల్లోకి వచ్చే మాటను పక్కన బెడితే ఆమె పేదలకు చేస్తున్న సాయంపై మాత్రం అనేకమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.