చిరంజీవి చెప్పింది నిజమే... 'శ్రీరస్తు శుభమస్తు' రివ్యూ రిపోర్ట్
'శ్రీరస్తు శుభమస్తు' నటీనటులు : అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవి ప్రకాష్, రణధీర్, హంసానందిని, సుమిత్ర తదితరులు. సాంకేతికవర్గం - సంగీతం: తమన్.యస్.యస్, ఫైట్స్: రామ్
'శ్రీరస్తు శుభమస్తు' నటీనటులు : అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవి ప్రకాష్, రణధీర్, హంసానందిని, సుమిత్ర తదితరులు.
సాంకేతికవర్గం - సంగీతం: తమన్.యస్.యస్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రామాంజనేయులు, సినిమాటోగ్రఫీ : మణి కంఠన్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: నాగరాజు, ఎడిటర్: మార్తాడ్ కె.వెంకటేష్, నిర్మాత: అల్లు అరవింద్, కథ-కథనం-దర్శకత్వం : పరశురామ్.
చిరంజీవి మేనల్లుడుగా 'గౌరవం'తో సిని కెరీర్‌ను ప్రారంభించి అంతే గౌరవం కల్గిన నటుడిగా వుండాలనుకున్న అల్లు శిరీష్.. ఆ సినిమా పెద్ద గౌరవాన్ని ఇవ్వలేకపోయింది. కాస్త గ్యాప్ తీసుకుని మారుతీ దర్శకత్వంలో 'కొత్తజంట' చేస్తే పర్వాలేదు అనిపించేలా సినిమా నడిచింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా శ్రీరస్తు శుభమస్తు. అల్లు అర్జున్ అంత యాక్టివ్ కాకపోయినా... తన శక్తి మేరకు తనేంటో నిరూపించుకోవాలని చేసిన ప్రయత్నమే ఇది. నాగార్జునతో నటించిన లావణ్య.. శిరీష్‌తో నటించింది. తను హీరో అవ్వాలని అనుకోలేదని స్టేట్‌మెంట్ ఇచ్చిన శిరీష్.. ఇందులో హీరోగా ఎలా వున్నాడో చూద్దాం.
కథ:
శిరీష్ (అల్లు శిరీష్) తండ్రి ప్రకాష్‌రాజ్ కోట్లు సంపాదించిన వ్యాపారవేత్త. మిడిల్‌క్లాస్ ప్రజలంటే అసహ్యం. పెద్ద కుటుంబాల పిల్లల్ని ఎరవేసి రాత్రికిరాత్రే కోటీశ్వరులు అవ్వాలనుకునే రకంగా ఆలోచిస్తాడు. పెద్దకొడుకు రవి.. మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమించి పెండ్లి చేసుకుంటే.. ఈ విషయాన్ని క్లాస్ పీకుతాడు. జగన్నాథరావు(రావురమేష్)ది మిడిల్‌క్లాస్. తల్లి లేని ఒకేఒక్క కూతుర్ని అనన్య(లావణ్యత్రిపాఠి)ని గారాబంగా పెంచడమే కాకుండా బాగా చదివిస్తాడు. స్నేహితుడు తనికెళ్ళభరణి.. పైస్థాయివాడైనా ఫ్రెండ్‌షిప్‌కొద్దీ.. అనన్య చదువుకు ఆర్థిక సాయం చేస్తాడు. తండ్రి వ్యాపారాన్ని చూసుకునే నిమిత్తం ఉత్తరాది వెళ్ళిన శిరీష్.. అక్కడ అనన్యను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు.
ఇక ఇంటికి వచ్చి తండ్రికి చెబితే ససేమిరా అంటాడు.. తాను పెద్దింటి అబ్బాయి అని తెలీకుండా.. ఆమె ప్రేమను పొంది తిరిగివస్తాను. లేదంటే.. మీకు నచ్చిన తాహతుగల అమ్మాయితో పెండ్లి చేయమని సవాల్ విసిరి వెళతాడు. ఆ తర్వాత శిరీష్.. ఎలా అనన్యను కలుసుకున్నాడు.. ఆ తర్వాత ఏం చేశాడు? ఆమె ప్రేమను పొందాడా? లేదా? అన్నది మిగిలిన కథ.
పెర్‌ఫార్మెన్స్:
శిరీష్ అభినయపరంగా తన నుంచి ఆశించడం కష్టమే. కాకపోతే తొలి రెండు చిత్రాల కంటే ఫర్వాలేదన్నట్లుగా వుంది. మొదటి నుంచి తనతో ఏదో ఒక పాత్ర ట్రావల్ కావడంతో కొట్టుకుపోయింది. ప్రి-క్లైమాక్స్‌లో తన తండ్రితో వాదించే సీన్ సినిమాకు కీలకం. అందులో బాగా కనెక్ట్ కాలేకపోయాడు. ఎమోషన్, ప్రేమను ఇంకాస్త మెరుగుపర్చుకోవాలి. లావణ్య త్రిపాఠి.. సినిమాను మోసేసింది. తనే సినిమాకు కీలకం. ఆమె చుట్టూ కథ తిరుగుతుంది.
సోగ్గాడే చిన్నపాత్రే అయినా.. ఇందులో పూర్తిస్థాయి పాత్ర కనుక... తండ్రి ప్రేమ ముందు తన ప్రేమను ఓడించేసుకుని.. లోపల మధనపడుతూ బాగా మెయిన్‌టేన్ చేసింది. అలీ పెళ్ళిల్లు చేసే ఈవెంట్ మేనేజర్‌గా.. శిరీష్ చెప్పినట్లు నడిచేవాడిగా తనదైన శైలిలో అలరించాడు. మధ్యతరగతి తండ్రిగా రావు రమేష్ చేస్తే.. ఓ స్థాయివాడిగా భరణి జీవించాడు. సుమలత... ప్రకాష్ రాజ్ భార్యగా నటించింది. అయితే ఆ పాత్రలో పెద్దగా నటనకు స్కోప్ వున్నది కాదు. స్ట్రిక్ట్ పోలీసు ఆఫీసర్‌గానూ, సిగ్గరిగానూ చేసిన సుబ్బరాజు పాత్ర నవ్విస్తుంది. హంసానందిని ఓ పాటలో తళుక్కుమంటుంది.
సాంకేతిక విభాగం:
కథకు తగినవిధంగా మణికంఠన్ సినిమాటోగ్రఫీ చేశాడు. క్లాస్ లుక్ వచ్చేలా ప్రతిసీన్‌ను అమర్చాడు. సంగీతపరంగా థమన్ కూడా బాణీలు ఆకట్టుకునేలా చేశాడు. నేపథ్య సంగీతం బాగుంది. పాటలు మూడే అయినా సంగీత్ రోజు వచ్చిన పాట ఆకట్టుకుంది. గీతాఆర్ట్స్ నిర్మాణపు విలువలుతో తీశారు. పరుశురామ్.. మాటలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాడు. పొందికగా వున్నాయి. ఉన్నవాడు దేవుడ్ని దగ్గరగా చూస్తే.. లేనివాడు దూరంగా చూస్తాడు.. అదీ ఇద్దరి మధ్య అంతరాలనేది డైలాగ్‌తో చెప్పేశాడు.
విశ్లేషణ:
కమర్షియల్ దర్శకుడిగా పేరున్న పరుశురామ్ పూర్తి ఫ్యామిలీ విలువలగల చిత్రాన్ని తీసే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో మొదట పార్ట్ జోవియల్‌గా సాగినా.. సెకండాఫ్‌లో చాలా విషయాలు కన్వీన్సిగా చూపలేకపోయాడు. హీరోయిన్ కథను నడుపుతుంటే.. తెరపై.. హీరో నడిపినట్లు కన్పిస్తుంది. ఆ కథనం అటు స్పీడ్ కాకుండా ఇటు స్లో కాకుండా మధ్యస్తంగా వుంటుంది. ప్రి-క్లైమాక్స్‌లో ప్రకాష్‌రాజ్‌తో హీరో చెప్పే డైలాగ్స్.. ఇంకాస్త పవర్‌ఫుల్‌గా వుండాలి. అందుకు హీరో కూడా బాధ్యుడే. ఇదికాక.. సినిమా అంతా చూస్తే.. చిరంజీవి ఆడియో వేడుకలో చెప్పినట్లు.. బొమ్మరిల్లును చూసినట్లుంటుంది. పైగా ప్రకాష్ రాజ్ పాత్ర కూడా సేమ్ టు సేమ్ కావడంతో పూర్తి లుక్ వచ్చేసింది. హీరో హీరోయిన్ ఇంటిలో ఏడు రోజులుంటే.. ఇక్కడ హీరోయిన్ ఇంట్లో బెస్ట్ ఫ్రెండ్‌గా 10 రోజులుంటాడు. అదే సినిమాలో తేడా.
శిరీష్‌ను బాగా ప్రమోట్ చేయడం కోసమే ఈ చిత్రాన్ని తీసినట్లు స్పష్టంగా కన్పిస్తుంది. ఫైనల్‌గా హీరోయిన్‌ను హీరో పెండ్లి చేసుకోవడం సుఖాంతం. అయితే.. సెకండాఫ్‌లో ఎక్కడికక్కడ హీరోయిన్‌తో కమిట్ చేయించాలనుకున్నప్పుడల్లా ఏదో అవాంతరాలు ఏర్పడటం... వాటిని హీరో సరిచేయడం.. చివరివరకు సాగదీసి... హీరోయిన్.. మరొకరితో పెండ్లికి సిద్ధమై.. 10 నిముషాల్లో పెండ్లి అనగానే.. ప్రకాష్‌రాజ్ రియలైజ్ అయి రావడం.. ఇవన్నీ.. బలవంతంగా ప్రేక్షకుడ్ని కూర్చోపెట్టినట్లుంది. బొమ్మరిల్లులో వున్న కిక్.. ఇందులో ముగింపులో కన్పించదు. ఏదోవిధంగా తండ్రిని కన్‌విన్స్ చేయించడమే దర్శకుడి ఆలోచన. అందుకు ఇంకాస్త మెరుగ్గా తీసుంటే బాగుండేది. శ్రీరస్తు శుభమస్తు.. అంటే శ్రీలక్ష్మిలా శుభంగా వుండాలనేది అర్థం. అయితే.. ఇందులో హీరోహీరోయిన్లకు శుభమే.. మరి.. లక్ష్మీలాంటి అమ్మాయిని తనింటి కోడలు చేసుకోవాలని తపించే తనికెళ్ళ భరణి కుటుంబానికి అశుభమనే అర్థంలా చేశాడు.
రేటింగ్: 2.5/5