కాంగ్రెస్ పార్టీలోకి వరుణ్ గాంధీ? రాహుల్ ఏమన్నారు?
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పెద్ద కుమారుడు సంజయ్ గాంధీ - మేనక గాంధీ దంపతుల కుమారుడైన వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు పుట్టుకొచ్చాయి. నిజానికి వరుణ్ గాంధీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన తల్లి మేనకా గాంధీ కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ది శాఖామంత్రిగా ఉన్నారు.
నెహ్రూ - గాంధీ కుటుంబాన్ని ఏకం చేసే చర్యల్లో భాగంగా వరుణ్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వచ్చిన వార్తలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించగా, ఆ తరహా ప్రచార వార్త గురించి తనకు తెలియదని సమాధానమిచ్చారు. నిజానికి రాహుల్ చెల్లి ప్రియాంకా గాంధీ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన విషయం తెల్సిందే. ఈమె ఉత్తరప్రదేశ్ తూర్పు కాంగ్రెస్ పార్టీ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.