జనసేన పార్టీలో చేరిన రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ ఆకుల సత్యనారాయణ...  
                                       
                  
				  				   
				   
                  				  300 కార్లతో రాజమండ్రి నుంచి విజయవాడకు ర్యాలీగారాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఆయన సతీమణి శ్రీమతి ఆకుల లక్ష్మీ పద్మావతి సోమవారం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. విజయవాడలోని పరిణయ కళ్యాణ వేదికలో ఈ కార్యక్రమం జరిగింది. వేలాది మంది అనుచరులతో కలసి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరారు. శ్రీ ఆకుల సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మీ పద్మావతిలకు పార్టీ అధినేత కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 
				  											
																													
									  
	 
	ఆయన్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు తెలిపారు. 2014 ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీ ఆకుల సత్యనారాయణ, జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత తన శాసనసభ్యత్వానికీ, భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. అంతకుముందు శ్రీ ఆకుల సత్యనారాయణ దాదాపు 300 కార్లు, వెయ్యి మంది జనసేన కార్యకర్తలు అభిమానులతో కలసి భారీ ర్యాలీగా విజయవాడకి తరలివచ్చారు. 
				  
	 
	 
	నరసాపురం నియోజకవర్గం నుంచి చేరికలు
	 
	అంతకుముందు పార్టీ కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి చెందిన మత్స్యకార సంఘం నాయకుడు శ్రీ బొమ్మిడి నాయకర్ తన అనుచరులతో కలసి జనసేన పార్టీలో చేరారు. శ్రీ పవన్‌కళ్యాణ్ గారు కండువా కప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఉభయ గోదావరి జిల్లాల అగ్నికుల క్షత్రియ సంఘం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న శ్రీ నాయకర్ 2009 నుంచి నరసాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు.