శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (14:42 IST)

శ్రీరాముడు ఓ నేపాలీ... సీత కూడా మా అమ్మాయే (video)

కోట్లాది మంది భారతీయుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడు జన్మస్థానంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఓ కథ చెప్పారు. శ్రీరాముడు ఓ నేపాలీ అని, ఆయన సతీమణి సీత కూడా తమ దేశ అమ్మాయేనని సెలవిచ్చారు. పైగా, శ్రీరాముడు జన్మస్థానంగా చెప్పుకునే అయోధ్య... తమ దేశంలోనే ఉందన్నారు. 
 
భారత భూభాగంలోని లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ వివాదం రేపి మ్యాపులు కూడా అచ్చేయించుకున్నారు. దీంతో భారత్ - నేపాల్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ మ్యాపు వ్యవహారం ఆ దేశ అధికార పార్టీలో చిచ్చురేపింది. ఈ చిచ్చు చివరకు ప్రధాని ఓలీ పదవి ఊడిపోయే పరిస్థితులు తెచ్చిపెట్టింది. 
 
ఈ నేపథ్యంలో కేపీ శర్మ ఓలీ.. శ్రీరాముడు పుట్టుకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శ్రీరాముడు మావాడేననీ, అసలైన అయోధ్య తమ దేశంలోనే ఉందని, శ్రీరాముడు నేపాల్ దేశస్థుడేనని చెప్పుకొచ్చారు. 
 
సాంస్కృతికంగా తాము అణచివేతకు గురికావడం వల్లే వాస్తవాలు మరుగునపడిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని.. తమ సీతకు భారత యువరాజైన శ్రీరాముడితో వివాహం జరిగినట్టు తాము విశ్వసిస్తున్నామని అన్నారు. 
 
అప్పట్లో అయోధ్య భారత్‌లో లేదని, ఇప్పుడున్నది కల్పిత ప్రాంతమని అన్నారు. నిజానికి తమ దేశంలోని బిర్గుంజ్ దగ్గర్లో ఉన్న గ్రామమే అయోధ్య అని వివరించారు. కాగా, ఓలీ వ్యాఖ్యలను స్వయంగా ఆ పార్టీ నేత ప్రచండ ఖండించండం గమనార్హం.