శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 30 జులై 2019 (22:29 IST)

పదవి కోసమే అయితే పార్టీ పెట్టాలా..? పవన్ వ్యాఖ్యలు.. భావోద్వేగంలో నాయకులు

నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసమే రాజకీయాల్లోకి రావాలనుకుంటే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, జాతీయస్థాయి నాయకులతో ఉన్న పరిచయాలు, స్టార్ డమ్ ఉపయోగించుకుంటే చాలని కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 
 
భావితరాల భవిష్యత్తు కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానని డబ్బు, పేరు కోసం ఏనాడూ పాకులాడలేదని, మానవత్వం చచ్చిపోకూడదని మాత్రమే నా వంతు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని, గెలుపు వచ్చిన తరువాత ఎవరు మనవాళ్లో, ఎవరు పరాయివాళ్లో తెలియదు కానీ, ఓటమిలో మాత్రం మనవాళ్లు ఎవరో కచ్చితంగా తెలుస్తుందన్నారు.
 
25 ఏళ్లు పోరాటం చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన నన్ను ఒక్క ఓటమి కుంగదీస్తుందా..?, ఒక్క అపజయం వెనకడుగు వేసేలా చేస్తుందా..? ఓటమి ఎదురైతే మరో పది అడుగులు ముందుకు బలంగా వేస్తానే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. 
 
ఓడిపోవటానికైనా సిద్ధమే కానీ విలువలు చంపుకోవటానికి మాత్రం సిద్ధంగా లేనని జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో కొందరు నేతలు భావోద్వేగానికి లోనైనట్టు సమాచారం..ఓటమితో కుంగిపోవద్దని వారిని పవన్ వారించారు.