మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 మే 2020 (08:47 IST)

లాక్డౌన్ కష్టాలు : 60 కిమీ నడిచివెళ్లి పెళ్లి చేసుకున్న వధువు

లాక్డౌన్ కష్టాలు ప్రతి ఒక్కరినీ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత మార్చి 25వ తేదీ నుంచి ఇది అమల్లో వుంది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. అదేసమయంలో ఈ రెండు నెలల కాలంలో అనేక పెళ్లిళ్లు వాయిదాపడ్డాయి. ముందుగు కుదుర్చుకున్న వివాహాలతో పాటు.. కొత్తగా చేసుకోవాల్సిన పెళ్లిళ్లు కూడా వాయిదాపడ్డాయి. అలాగే, ఈ లాక్డౌన్ కారణంగా ఓ పెళ్లి రెండుసార్లు వాయిదాపడింది. ఇకలాభంలేదని భావించిన వధుకు ఏకంగా 60 కిమీ నడిచివెళ్లి మెడలో మూడుముళ్లు వేయించుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కన్నౌజ్ జిల్లాలోని లక్ష్మణ్ తిలక్ అనే గ్రామానికి చెందిన గోల్దీ అనే యువతికి భైసాపూర్ గ్రామానికి చెందిన వీరేంద్ర కుమార్‌తో పెళ్లి నిశ్చయమైంది. వీరి పెళ్లిని ఏప్రిల్‌ నెలలో జరిపించాలని నిశ్చయించిన పెద్దలు, ఆపై లాక్డౌన్ కారణంగా మే నెల 4కు వాయిదా వేశారు. ఆ తర్వాత మే 5 నుంచి మే 31వ తేదీ వరకు లాక్డౌన్ పొడగించారు.
 
దీంతో ఈ పెళ్లి మరోమారు వాయిదాపడింది. పైగా, మేలో కూడా వివాహం జరిగే వీలు కుదరకపోవడంతో మరో మంచి ముహూర్తం చూద్దామని పెద్దలు భావించారు. అయితే, తనకు వెంటనే పెళ్లి చేయాలని, ఇక శుభ ముహూర్తాల కోసం వేచి చూడవద్దని వధువు తన తల్లిదండ్రులతో వాదించగా, వారు నిరాకరించారు. 
 
దీంతో మనస్తాపానికి గురైన ఆమె, ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి వరుడి గ్రామానికి చేరింది. తమ కుమార్తె కనిపించడం లేదని గోల్డీ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న సమయంలోనే, ఆమె కాబోయే అత్తగారింటికి చేరిందన్న సమాచారం అందింది. 
 
ఆపై పెళ్లిని అందరి సమక్షంలో ఘనంగా జరిపిస్తామని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో, సాదాసీదాగా పెళ్లి తంతును కానిచ్చేశారు. నడిచి వచ్చిన వధువుతో వీరేంద్ర కుమార్ వివాహం జరిగిందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని జిల్లా ఎస్పీ అమరేందర్ సింగ్ వెల్లడించారు.