సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 మార్చి 2021 (18:08 IST)

అద్భుతం, ఊరు పక్కనే బంగారం కొండ, తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత

మన ఊరు పక్కనే బంగారు పర్వతం వుంటే ఎలా వుంటుంది. తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత వుంటే ఇంకేముంది. ఆఫ్రికా దేశంలోని దక్షిణ ప్రావిన్స్ కాంగోలోని ఒక గ్రామంలో బంగారు పర్వతం గురించి వార్త తెలియగానే వేలాది మంది బంగారాన్ని కొల్లగొట్టడానికి పరుగెత్తారు.
 
వారంతా సాధ్యమైనంత ఎక్కువ బంగారాన్ని తవ్వుకుని తెచ్చుకునేందుకు సంచులు, గోతాలు, ఆఖరికి దుప్పట్లు సైతం తీసుకుని పరుగులుపెట్టారు. బంగారం కొండను తవ్వి ఆ మట్టిని తీసుకొని బంగారాన్ని కడగడం, మట్టిని తొలగించి చిన్నచిన్న బంగారు ముద్దలను వేరు చేస్తున్నారు.
 
ఈ బంగారు కొండను నిత్యం తవ్వుతూ పెద్ద సంఖ్యలో జనసమూహాల వస్తుండటంతో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ప్రజలను అక్కడికి వెళ్లడాన్ని నిషేధించింది. 
 
ఫిబ్రవరి చివరి రోజుల్లో లుహిహి గ్రామంలో బంగారం అధికంగా ఉన్న ధాతువు కనుగొనబడిందని, ఆ తర్వాత అక్కడ త్రవ్వకాల కోసం జనం గుమిగూడారని కాంగో మంత్రి వెనంత్ బురుమే చెప్పారు.
 
ఈ కారణంగా ఈ చిన్న గ్రామంలో కొండను తవ్వడం నిషేధించబడింది. ప్రజల రద్దీ ఎక్కువ కావడంతో అక్కడికి సైన్యాన్ని పంపాల్సి వచ్చిందన్నారు. కాగా జీవనోపాధి కోసం బంగారం తవ్వడం కాంగోలో సాధారణం. కాంగో తూర్పు మరియు ఈశాన్య ప్రాంతాలలో బంగారం త్రవ్వడం ఒక కుటీర పరిశ్రమ లాంటిది.
 
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం, ఇక్కడి నుండి అనేక టన్నుల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసి, తూర్పు పొరుగు దేశాల ద్వారా ప్రపంచ సరఫరా మార్కెట్‌కు పంపుతారు. ఈ కారణంగా, కాంగో ప్రభుత్వానికి ఈ బంగారం నుండి ప్రత్యేక ప్రయోజనం లభించడంలేదు. ఈ కారణంగా అక్కడ ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఉన్నాయి. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ ప్రయత్నం విజయవంతం కాలేదు.