గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (20:20 IST)

చిక్కుల్లో పడిన కేరళ సీఎం : గోల్డ్ స్మగ్లింగ్‌లో విజయన్ పాత్ర!!

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చిక్కుల్లో పడ్డారు. సరిగ్గా ఎన్నికల సమయంలో ఆయనను కష్టాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసుతో సీఎం పినరయ్‌కు సంబంధముందని ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇదే విషయాన్ని ఈ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్ కూడా తన దర్యాప్తులో వెల్లడించారు. 
 
ఈ స్మగ్లింగ్‌లో సీఎం పినరయ్ విజయన్ పాత్ర కూడా ఉందని, ఆయన నిండా మునిగారని కస్టమ్స్ అధికారులకు చెప్పారు. సీఎం పినరయ్‌తో పాటు మరో ముగ్గురు మంత్రుల పేర్లను కూడా స్వప్నా సురేశ్ విచారణ సందర్భంగా బయటపెట్టారు. ముగ్గురు మంత్రులతో పాటు స్పీకర్ కూడా ఇందులో పాత్రధారి అంటూ ఆమె వెల్లడించారు. ఇదే విషయాన్ని కస్టమ్స్ అధికారులు కేరళ హైకోర్టుకు కూడా వెల్లడించారు. 
 
'సీఎం విజయన్‌ అరబ్బీ భాషలో మాట్లాడలేరు. అందుకే కాన్సులేట్ జనరల్‌కు, సీఎం విజయన్‌కు మధ్య అనుసంధానకర్తగా స్వప్న సురేశ్ వ్యవహరించారు. ఈ డీల్‌లో సీఎంతో సహా మంత్రులకు కోట్లాది రూపాయలు కమిషన్‌గా ముట్టిందని స్వప్న సురేశ్ దర్యాప్తు సందర్భంగా వెల్లడించారు' అని కస్టమ్స్ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
 
తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు వస్తున్న పార్శిల్‌లో 15 కోట్ల రూపాయల విలువచేసే 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం కేరళను కుదిపేసింది. జాతీయ భద్రత నేపథ్యంలో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించారు. ఈ వ్యవహారంలో కేరళ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  
 
కాగా, త్వరలోనే దేశంలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో కేరళ కూడా ఉంది. ఇందుకోసం నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతోంది. ఇందుకోసం తమ సీఎం అభ్యర్థిగా మెట్రోమ్యాన్ కె.శ్రీధరన్ పేరును ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో కేరళ సీఎం విజయన్‌పై ఈ తరహా ఆరోపణలు రావడం గమనార్హం.