అంబానీ ఇంటి వద్ద పేలుడు.. స్కార్పియో కారు యజమాని సూసైడ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద ఇటీవల బాంబు పేలుడు సంభవించింది. స్కార్పియో కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది ముంబై మహానగరంలో కలకలం రేపింది. ఇపుడు ఈ కారు యజమాని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ వివరాలను పరిశీలిస్తే, గత నెల 25వ తేదీన అంబానీ ఇంటికి సమీపంలో ఓ స్కార్పియో వాహనాన్ని పార్క్ చేసి ఉంచారు. భద్రతా సిబ్బంది ఆ వాహనాన్ని గుర్తించి తనిఖీ చేయగా, అందులో జిలెటిన్ స్టిక్స్‌ను కనుగొన్నారు. అంతేకాదు ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి రాసిన ఒక లేఖ కూడా అందులో దొరికింది.
ఆ తర్వాత ఆ వాహనం రిజిస్ట్రేషన్ నంబరు ఆధారంగా పూర్తి వివరాలను సేకరించారు. ఈ క్రమంలో ఆ కారు యజమాని మన్‌సుఖ్ హిరెన్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైకి సమీపంలోని ఓ వాగులో అతని మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. వంతెనపై నుంచి దూకి అతను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కాగా, అంబానీ ఇంటి వద్ద ఉన్న స్కార్పియో వాహనం అంతకు ముందే చోరీకి గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఆ వాహనాన్ని తామే అక్కడ ఉంచినట్టు జైష్ ఉల్ హింద్ సంస్థ ప్రకటించుకుంది. అయితే, ఆ ఘటనకు ఆ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.