ఎవడు నాన్ లోకల్?... యూస్‌లెస్ ఫెలోస్ : నాగబాబు ఫైర్
తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన తరపు సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా మెగా బ్రదర్ నాగబాబు పోటీచేస్తున్నారు. కాగా, వైకాపా ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు తనను 'నాన్ లోకల్' అంటూ తేలికగా తీసిపారేయడంపై ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయిన నాగబాబు... "ఎవడు నాన్ లోకల్? ఏం తెలుసు ఈ వెధవలకి? యూస్‌లెస్ ఫెలోస్" అంటూ నిప్పులు చెరిగారు.
తాను పుట్టింది మొగల్తూరులో అయినప్పటికీ హైస్కూల్ నుంచి కాలేజ్ వరకు నరసాపురంలోనే చదివాననీ... తన భార్యది కూడా పశ్చిమ గోదావరి జిల్లానేననీ... తాను ఈ జిల్లా అంతా తిరిగాననీ... తమ నాన్నది కూడా పెనుగొండేనని చెప్పుకొచ్చిన ఆయన... "ఇవన్నీ తెలుసుకోకుండా సొల్లు మాటలు చెబుతున్నారంటూ మండిపడ్డారు.
"ఎవడా సన్నాసి నన్ను నాన్‌లోకల్ అన్నది? ఇంతకంటే పనికిమాలినతనం మరొకటి ఉంటుందా? నాపై పోటీ చేస్తున్న రఘురామ కృష్ణంరాజు ఏమన్నా లోకల్ అభ్యర్థా? రోజుకో పార్టీ మారుతూ, పండుగలు, పబ్బాలు వస్తే బెట్టింగ్ బంగార్రాజులా వ్యవహారాలు చేసే సిగ్గులేనివాళ్లు" అంటూ విమర్శల వర్షం కురిపించారు.
అసలైన లోకల్ తానేనని, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేవాడు ఎవడైనా లోకలేనని వ్యాఖ్యానించిన నాగబాబు... తనను నాన్ లోకల్ అంటున్న రాస్కెల్స్ కంటే తానే మేలు అని చెప్పుకొచ్చేశారు.
ఏది ఏమైనా... ఏ పొలిటికల్ లీడర్ అయినా... ఎన్నికలు పూర్తయ్యే వరకు లోకలే కదా... తర్వాత కదా వాళ్లు ఎక్కడ ఉన్నారో వెతుక్కోవలసి వచ్చేది... అంతేగా మరి.