శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By మోహన్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:59 IST)

ఏడు సంవత్సరాలుగా కరెంట్ బిల్లు చెల్లించని బీజేపీ ఎంపీ?

మనం ఒక్క నెల కరెంటు బిల్లు చెల్లించకుంటే ఫైన్ వేసి మరీ మరుసటి నెలలో చల్లిస్తాము. అయితే ప్రజాప్రతినిధుల వ్యవహారం వేరేలా ఉంటుంది. వారు తమ ప్రాబల్యంతో కరెంటు ఛార్జీలు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటిదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరుకాబాద్ బీజేపీ ఎంపీ ముకేష్ రాజ్‌పూత్ ఇలాంటి ఘనకార్యమే చేసాడు. 
 
ఈ విషయం అయ్యగారు ఎలక్షన్ నామినేషన్ వేసేటప్పుడు బయటకు వచ్చింది. ఫరుకాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ముకేష్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే క్రమంలో విద్యుత్‌శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి వచ్చింది. కాగా గత ఏడు సంవత్సరాలుగా ముకేష్ విద్యుత్ బిల్లులు చెల్లించని కారణంగా విద్యుత్ శాఖకు లక్షల్లో బకాయిపడ్డాడు. 
 
నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా వారిని కోరగా బిల్లు చెల్లింపులు చేస్తేనే ఇస్తామని చెప్పడంతో సదరు ఎంపీ ఇంజినీర్‌కు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ బెదిరింపుల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంపీ బెదిరింపులపై ఇంజినీర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసాడు.