రాజకీయాలు ఎవరైనా చేయొచ్చు.. కానీ చెల్లి పుట్టుకను శంకించేవారు ఉంటారా? చంద్రబాబు
రాజకీయాలు ఎవరైనా చేయొచ్చని, కానీ, తన స్వార్థ రాజకీయాల కోసం సొంత చెల్లి పుట్టుకను కూడా శంకించేవారు ఎవరైనా ఉంటారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా, తాను కొనసాగిస్తున్న ప్రజాగళం పర్యటనలోభాగంగా, తొలిరోజున సుడిగాలి పర్యటన చేశారు. కుప్పం నుంచి బయలుదేరిన ఆయన పలమనేరు, పుత్తూరు, నగరి సభల్లో పాల్గొన్న ఆయన చివరగా మదనపల్లె సభలో కీలక ప్రసంగం చేశారు. మదనపల్లె సభకు వచ్చిన ప్రజాస్పందన తన జీవితంలో చూడలేదని అన్నారు. ఈ ప్రభుత్వంపై మీకు కోపం, కసి ఉంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అరాచకాలకు పాల్పడే వారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం వచ్చిందని... రౌడీయిజం కావాలో, ప్రజాస్వామ్యం కావాలో ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.
సంపద సృష్టించడం తెలిసిన కూటమి ఎన్డీయే అని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకువస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. జగన్ తన బాబాయి వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తులతో తిరుగుతున్నారు. రాజకీయాల్లో ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు... కానీ సొంత చెల్లి విషయంలో తప్పుడు ప్రచారం చేసే వాళ్లను ఏమనాలి? ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలుంటారని చెబుతారు. టీడీపీకి ఈ సంస్కారం ఉంది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిందలు భరిస్తున్నాం. ముందు చెల్లెళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పాకే ఓటు అడగాలి అని చూసించారు.
చిత్తూరు జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి పాలన నడుస్తోంది. జిల్లాలో కాంట్రాక్టులన్నీ ఆయనకే. మంత్రి పెద్దిరెడ్డి ఉదయం ఇసుకను అల్పాహారంగా తీసుకుంటాడు, మధ్యాహ్నం మైన్స్‌ను భోంచేస్తాడు. ఇసుకను అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నారు. తండ్రికి పుంగనూరు, చిన్నాన్నకు తంబళ్లపల్లి, అబ్బాయికి రాజంపేట... అన్నమయ్య జిల్లాను మీకేమైనా రాసిచ్చేశారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తనది సుదీర్ఘ రాజకీయ జీవితం. ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయా? నిరుద్యోగుల భవిష్యత్‌తో ఆటలాడుతున్నారు. యువతను గంజాయికి బానిసలుగా మార్చారు. కరెంటు బిల్లులు అమాంతం పెంచేశాడు. బటన్ నొక్కిన తర్వాత ఎంత బొక్కుతున్నాడో చెప్పాలి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాడు, నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఇలా పేదల రక్తాన్ని పీల్చుతున్న జలగను తరిమికొట్టాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు.