విజయసాయి ఆధీనంలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు విముక్తి
ఎట్టకేలకు వైకాపా సీనియర్ నేత విజయసాయిరెడ్డి కుటుంబ ఆధీనం నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కి విముక్తి లభించింది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఏసీఏను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ గద్దె దించడంతో ఆ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు రాజీనామా చేశారు.
వీరి రాజీనామాలను ఏసీఏ సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. విజయవాడలోని ఓ హోటల్‌లో సర్వసభ్య సమావేశం జరిగింది. ఎసిఎ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎస్‌ఆర్ గోపీనాథ్‌రెడ్డితో పాటు మరికొంతమంది రాజీనామాలను సమావేశంలో ఆమోదించారు.
అలాగే ఏసీఏ కోసం కొత్త మేనేజ్‌మెంట్ బాడీని సెప్టెంబర్ 8న ఎన్నుకోనున్నారు. కొత్త ఆర్గనైజింగ్ బాడీ ఎన్నిక వరకు ఏసీఏ నిర్వహణ కోసం ముగ్గురు సభ్యుల కమిటీని కేటాయించారు. త్రిసభ్య కమిటీలో ఆర్‌విఎస్‌కె రంగారావు (విజయనగరం), మాంచో ఫెర్రర్ (అనంతపురం), జె.మురళీమోహన్ (గుంటూరు) సభ్యులుగా నియమితులయ్యారు.