ఆంధ్రప్రదేశ్‌కు భారీగా వచ్చిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లు
కరోనా వ్యాక్సిన్ల కొరతతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఊరట కలిగింది. రాష్ట్రానికి భారీ సంఖ్యలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి 4.44 లక్షల డోసులు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నాయి. ఈ టీకాలను అధికారులు గన్నవరంలోని వ్యాక్సిన్ స్టోరేజి యూనిట్‌కు తరలించారు. ఈ డోసులను జిల్లాలకు విడతల వారీగా తరలించనున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 79,00,175 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. వారిలో రెండు డోసులు అందుకున్నవారు 23,44,455 మంది. ఇంకా 55 లక్షల మందికి పైగా రెండో డోసు కోసం వేచిచూస్తున్నారు. వ్యాక్సిన్ కొరతతో ఏపీలో వ్యాక్సినేషన్ నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో పూణే నుంచి తాజాగా రాష్ట్రానికి చేరుకున్న టీకా డోసులతో వ్యాక్సినేషన్ కొద్దిమేర ఊపందుకోనుంది. అటు, కరోనా వ్యాక్సిన్ల అంశంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
కాగా, కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుంటోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. పీఎం కేర్స్ నిధుల్లో భాగంగా ఏప్రిల్ 6 నాటికి రాష్ట్రాలకు 34,040 వెంటిలేటర్లను కేటాయించిందని వెల్లడించారు.
అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 4,960 వెంటిలేటర్లు ఇవ్వడం జరిగిందని జీవీఎల్ వివరించారు. దేశం మొత్తమ్మీద 7వ వంతు కేటాయించారని, ఏపీపై కేంద్రానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ మేరకు వెంటిలేటర్ల కేటాయింపు జాబితాను కూడా జీవీఎల్ పంచుకున్నారు. ఇందులో, ఏపీ తర్వాత మహారాష్ట్రకు అత్యధికంగా 4,434, యూపీకి 4,016 వెంటిలేటర్లు కేటాయించారు.