సప్త సాగరాలు ఈది పిల్ల కాలువలో పడిన చందంగా ఉంది.. వర్ల రామయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలను హైకోర్టు సింగిల్ జడ్జి రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నీలం సాహ్నీపైనా న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అర్థం చేసుకోవడంలో కూడా విఫలమయ్యారని విమర్శించింది. ఎస్ఈసీగా ఆమె అర్హతను కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించింది.
దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. "అమ్మా నీలం సాహ్నీ గారూ... ఎంతోకాలం ఐఏఎస్ అధికారిగా పనిచేసిన మీరు జగన్ మాటలు విని అభాసు పాలయ్యారు" అని వ్యాఖ్యానించారు. సప్త సాగరాలు ఈది, చివరకు పిల్ల కాలువలో పడినట్టయింది అని ఎద్దేవా చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించిన తీరు తప్పు అని హైకోర్టు స్పష్టం చేసిందని, నీలం సాహ్నీ వెంటనే పదవికి రాజీనామా చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
మరోవైపు ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈమె నియామకం సరైనది కాదని పిటిషన్‍లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను రేగు రమేశ్ అనే వ్యక్తి దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుందని తెలిపింది.
జగన్ ప్రభుత్వంలో నీలం సాహ్ని తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత ఆమె పదవీ విరమణ చేశారు. అనంతరం జగన్ ఆమెను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ పదవీకాలం ముగిసింది. దీంతో, ఆమెను నిమ్మగడ్డ స్థానంలో ఎస్ఈసీగా నియమించారు.
ఎస్ఈసీగా ఆమె పదవీ బాధ్యతలను చేపట్టిన రోజునే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం పది రోజుల వ్యవధిలోనే పోలింగ్ ప్రక్రియను పూర్తిచేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నోటిఫికేషన్‌కు, పోలింగ్ కు మధ్య నాలుగు వారాల వ్యవధి ఉండాలని, సుప్రీం ప్రాథమిక ఆదేశాలను తుంగలో తొక్కారంటూ ఎస్ఈసీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలను రద్దు చేసింది.