సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (14:52 IST)

ఆయుర్వేద మందుపై అధ్యయనం : నెల్లూరుకు ఐసీఎంఆర్ వైద్య బృందం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొగిని ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు ఇచ్చే ఆయుర్వేద మందు కరోనాను పారదోలుతుందని ప్రజలు గట్టిగా నమ్మడమే కాదు, ఆ మందు కోసం తండోపతండాలుగా తరలివస్తున్నారు. మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా నిత్యం వేలమంది ఆనందయ్య కరోనా మందు కోసం బారులుతీరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కృష్ణపట్నం వెళ్లే దారులన్నీ ప్రజలతో నిండిపోయికనిపిస్తున్నాయి. 
 
అంతేకాకుండా, ఈ మందు వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం తన సమీక్ష సమావేశంలో చర్చించారు. దీనికి అనుమతి ఇచ్చే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. అయితే, ముందుగా ఆ ఔషధం శాస్త్రీయతను నిర్ధారణ చేయించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. 
 
అందుకోసం నెల్లూరుకు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలతో కూడిన ఐసీఎంఆర్ బృందాన్ని పంపించాలని ఆదేశించారు. ఆయుర్వేద మందు గుణగణాలపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులకు నిర్దేశించారు. ఆ తర్వాతనే దానిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
 
అయితే, స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి చొరవతో గత మూడు రోజులుగా నిలిచిపోయిన ఆయుర్వేదం మందు పంపిణీ తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ మందుకోసం ఇప్పటికే ఐదు వేల మందికిపైగా జనం అక్కడకు చేరుకున్నారు.