డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్ : తిరుపతిలో తొలి డెల్టా ప్లస్ కేసు
ఏపీలోని తిరుపతిలో తొలి డెల్టా ప్లస్ కేసు వెలుగు చూడటంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వ్యక్తికి ప్రాథమిక కాంటాక్టులుగా గుర్తించిన 16 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. వాటిని హైదరాబాద్‌లోని సీసీఎంబీకి శనివారం పంపారు. ఒకరి నుంచి రెండు శాంపిల్స్ సేకరించి ఒకటి స్విమ్స్, మరొకటి సీసీఎంబీకి పంపారు.
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి శ్రీహరి ఆ ఏరియాలో పర్యటించి ఫీవర్ సర్వేపై పలు సూచనలు చేశారు. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. వేరియంట్ వేగంగా విస్తరించే లక్షణం ఉన్నప్పటికీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. ప్రజల రాకపోకలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో డెల్టా ప్లస్ వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది.
కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు గుర్తించిన ప్రాంతాల్లో కఠిన కంటైన్మెంట్ ఏర్పాట్లు, కాంటాక్ట్ ట్రేసింగ్ సహా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించింది.