శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (08:10 IST)

నేడు ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగుల ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇపుడు ఆందోళనలతో అట్టుకుడిపోతోంది. నిత్యం ఏదో ఒక అంశంపై రాష్ట్రంలో ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. పీఆర్సీ సాధన కోసం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన సమ్మెతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు.. వైకాపా ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇది టీ కప్పులో తుఫానులా మారింది. కానీ, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆందోళనను విరమించినా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా నిరుద్యోగులు జతకలిసారు. 
 
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేయాలని నిరుద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. మరోవైపు, నిరుద్యోగుల ఆందోళనలకు విద్యార్థి సంఘాలు కూడా  సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 
 
ఈ నేపథ్యంలో జిల్లాలోని విద్యార్థి సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి ముందుస్తుగా పలు చోట్ల నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ కోసం తక్షణం విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో వారు ఈ ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రంలో వివిధశాఖల్లో ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.