గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (08:40 IST)

మద్యం బాటిల్‌ను రూ.50కు ఇస్తే ప్రతి నెలా రూ.6 వేలు ఆదా : సోము వీర్రాజు వివరణ

తమ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే నాణ్యమైన మద్యాన్ని కేవలం రూ.50కే ఇస్తామన్న బీజేపీ ఏపీ శాఖ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నేత తీవ్రంగా ఖండించారు. చివరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. సీపీఎం ఏపీ శాఖ కార్యదర్శి రామకృష్ణ అయితే, ఏకంగా సోము వీర్రాజు కాస్త సారాయి వీర్రాజుగా మారిపోయారంటూ సెటైర్లు వేశారు. నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సోము వీర్రాజు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. పేదల కష్టాన్ని జగన్ ప్రభుత్వం దోచుకుంటుందని, అందుకనే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. మద్యం కోసం పేదలు రోజుకు రూ.250 ఖర్చు చేస్తున్నారనీ, ఆ ఖర్చులో రూ.200 తగ్గిస్తే ఆ కుటుంబంపై భారం తగ్గుతుందని, ప్రతి నెలా రూ.6 వేల వరకు ఆదా అవుతుందని వివరించారు. 
 
అలాగే, తనపై విమర్శలు చేసిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. తమ్మినేనికి రాత్రిళ్లు ఎక్కువై ఉదయం నోరు మడతపడుతుందని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఓ మొబైల్ పొలిటీషియన్ అని అన్నారు. మంత్రి కొడాలి నాని చేతికి దారాలు తప్ప తలలో మెదడు లేదంటూ సెటైర్లు వేశారు.