మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (13:45 IST)

ఆర్థికంగా రాష్ట్రం నష్టపోయినా రైతులకు సాయం ఆగదు : ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రం అప్పులపాలైందనీ, త్వరలోనే దివాళా తీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులతో పాటు.. విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక వ్యాఖఅయలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయినా రైతులకు సాయం చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 
 
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేస్తున్నామన్నారు. మూడో ఏడాది రెండో విడత రైతు భరోసా నిధులను ఆయన ఇవాళ విడుదల చేశారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద రూ.2,190 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.  
 
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు భరోసా కింద ఇప్పటిదాకా రూ.18,777 కోట్లు విడుదల చేశామని చెప్పారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.1,180 కోట్ల బకాయిలనూ తాము చెల్లించామన్నారు.
 
కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనా తాము వెనక్కు తగ్గలేదన్నారు. కరవు సీమలోనూ సాగునీరు పారిస్తున్నామని చెప్పారు. 29 నెలల పాలనలో ఎన్నో మార్పులను తీసుకొచ్చామని, వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పుడు రూ.2,134 కోట్లతో యంత్ర సేవా కేంద్రాలనూ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు.
 
కాగా, ప్రభుత్వం 50.37 లక్షల మంది రైతులకు రైతు భరోసాను, 6.67 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాలను అందిస్తోంది. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.25.55 కోట్లు ఇవ్వనున్నారు.