ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (13:49 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెరాస పెట్టమంటున్నారు : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్టాలని చాలా మంది కోరుతున్నారని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. అంతేకకాకుండా, తెలంగాణ ఉద్యమంపై ఆనాడు ఉన్న అనుమానాలు, అపోహలు, దుష్ప్రచారాల మధ్య గులాబీ జెండా ఎగిరిందన్నారు. 
 
2001 ఏప్రిల్‌ 27న కొండా లక్ష్మణ్‌ బాపూజీ సమక్షంలో జలదృశ్యంలో తెరాస ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న తెరాస ప్లీనరీలో ఆయన మాట్లాడారు. తెరాస అధ్యక్షుడిగా పదోసారి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం కేసీఆర్‌ అధ్యక్షోపన్యాసం చేశారు. అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
 
'ఆనాడు ఉద్యమంపై అపనమ్మకం, గమ్యంపై స్పష్టత లేని పరిస్థితి ఉండేది. అలాంటి అగమ్యగోచర స్థితిలో తెరాస పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. కొద్దిమంది మిత్రులతో ఉద్యమం ప్రారంభమైంది. స్వాతంత్ర్యోద్యమంలోనూ ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా పోరాటం ఆగలేదు. 
 
ఆ పోరాటంలో నిజాయతీ ఉంది కాబట్టే అంతిమంగా విజయం దక్కింది. తెలంగాణకు కూడా అదే పద్ధతి నేర్పించాలని.. దాన్ని కొనసాగించాలని.. ప్రజల్లో విశ్వసనీయత కల్పించాలని స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాం. విశ్వాస రాహిత్య స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటకు తెచ్చేందుకు ముందుకెళ్లాం.
 
ఆ సమయంలో సమైక్య పాలకులు వేయని నిందలు.. పెట్టలు తిప్పలు లేవు. ఎన్ని చేయాలో అన్నీ చేశారు. చివరకు రాజ్యసభలో బిల్లు పాసయ్యే ముందు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. మనం కూడా అంతే పట్టుదలతో ముందుకు సాగాం.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. 
అహింసాయుత మార్గంలో పోరాటం చేసి విజయం సాధించవచ్చని నిరూపించాం. ప్రపంచ ఉద్యమాలకే కొత్త భాష్యాన్ని, బాటను నిర్దేశించగలిగాం. చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వతంగా కీర్తి ఉంటుంది. దీనిలో ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు. 
 
తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని.. పాలన చేతకాదని, భూముల ధరలన్నీ పడిపోతాయని దుష్ప్రచారం చేశారు. ఏడేళ్ల పాలనలో ఆ అపోహలన్నీ పటాపంచలు చేశాం. ఎఫ్‌సీఐ కూడా కొనలేమని చెప్పే స్థాయిలో వరి పండించాం. ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచాం. గతంలో ఉపాధికోసం పాలమూరు నుంచి ముంబయి వలస వెళ్లేవారు. ఇప్పుడు పాలమూరుకి వస్తున్నారు. 
 
దళితబంధు ప్రకటించాక ఆంధ్రా నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయి. ఆంధ్రాలో పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని చెబుతున్నారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారు. ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారు. తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. 
 
నాందేడ్‌, రాయచూర్‌ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు వచ్చాయి. దేశ విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడిస్తోంది. మన పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు. పథకాలకు ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తోందని అడిగారు. సాహసం లేకుంటే ఏ కార్యం సాధ్యం కాదు. కలలు కని.. ఆ కలలనే శ్వాసిస్తే సాకారమవుతాయి' అని కేసీఆర్‌ అన్నారు.