వరద సాయం చేయాలంటూ ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ  
                                       
                  
                  				  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల అపారమైన నష్టం వాటిల్లిందని, ఈ నష్టాన్ని ఆదుకోవాలని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా, తక్షణ సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 
				  											
																													
									  
	 
	అలాగే, వరద బాధిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రూ.6.54 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన గుర్తుచేశారు. 
				  
	 
	ముఖ్యంగా నాలుగు ప్రధాన జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైందని, పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నారు. తిరుపతి, తిరుమల, నెల్లూరు మదనపల్లె, రాజంపేట వంటి ప్రాంతాలు నీట మునిగాయని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు.