గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (14:33 IST)

కొండపల్లి వివాదంపై హైకోర్టు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మరోమారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం ఉద్రిక్తంగా మారడంతో హైకోర్టు మండిపడింది. 
 
కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 స్థానాలు ఉండగా, వీటిలో 14 అధికార వైకాపా, 15 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే, 16 మంది కోరం ఉంటేనే ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్‌అఫిషియో ఓటును వినియోగించుకోనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన కౌన్సిల్ కార్యావద్దే తిష్టవేశారు. అలాగే, వైకాపా, టీడీపీ శ్రేణులు కూడా భారీ సంఖ్యలో కార్యాలయం వద్ద చేరుకున్నాయి. మరోవైపు, ఎంపీ కేశినేని ఓటు చెల్లదంటూ వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఫలితంగా రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేయగా, ఈ రోజు కూడా కౌన్సిల్ కార్యాలయం వద్ద గందరగోళం చోటుచేసుకుంది. దీంతో ఛైర్మన్ ఎన్నికను ఆర్వో నిరవధికంగా వాయిదా వేశారు. 
 
ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంపై టీడీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు చేపట్టిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ పోలీస్ సమిషనర్, కొండపల్లి మున్సిపల్ కమిషనర్‌లు కోర్టుకు రావాలంటూ ఆదేశించింది.