ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2023 (11:59 IST)

ఏపీలో మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణం.. ఎన్నికలకు ముందే అమలు!

apsrtc
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా యోచన చేస్తుంది. వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటర్లను తమ వైపునకు ఆకర్షించి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇందులోభాగంగా, ఎన్నికలకు ముందే కొన్ని తాయిలాలను ప్రటించేందుకు సమాయాత్తమవుతుంది. వీటిలో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇప్పటికే కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకానికి మహిళల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. దీంతో ఈ పథకాన్ని ఎన్నికలకు ముందుగానే అమలు చేయాలని భావిస్తున్నారు. 
 
నిజానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఆర్నెళ్ల క్రితం రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు వేదిక నుంచి ప్రకటించిన ఐదు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ఉంది. ఈ విషయాలను గమనించిన ఏపీ సీఎం జగన్‌ ఎన్నికలకు ముందే ఈ బాటలో పయనించేందుకు దాదాపు సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్రంలో ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై పడే భారం ఎంత? రోజు వారీ ప్రయాణికుల్లో మహిళలు ఎంతమంది ఉన్నారు? ఏ రకమైన బస్‌ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఓట్లు కురిపిస్తాయి? వంటి అంశాలపై కసరత్తు మొదలు పెట్టారు. 
 
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారితో పాటు రవాణా శాఖ కీలక అధికారి ఆర్టీసీ హౌస్‌కు వచ్చి ఎండీ ద్వారకా తిరుమలరావుతో భేటీ అయ్యారు. ఆర్టీసీకి ఉన్న సమస్యలతో పాటు ఆర్థిక పరిస్థితులపై ఆరా తీసి, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఆర్టీసీ ఎండీతోనూ మాట్లాడినట్లు తెలిసింది. అలాగే, కర్నాటక రాష్ట్రానికి వెళ్లి అక్కడ పథకం అమలు తీరుతెన్నులను తెలుసుకున్నట్టు సమాచారం. పైగా, ఈ పథకంపై కొత్త సంవత్సరం నాడు లేదా సంక్రాంతి రోజున సీఎం జగన్‌ దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.