ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 జూన్ 2024 (15:11 IST)

మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ : ఏపీ సర్కారు తొలి కేబినెట్ నిర్ణయాలివే...

chandrababu naidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఆ రాష్ట్ర ప్రభుత్వ తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అజెండాలోని అన్ని అంశాలకు క్యాబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు అంశాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఈ మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులకు రాజకీయ అంశాలపై దిశానిర్దేశం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఇతర మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
 
ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే.. 
 
మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి మంత్రివర్గ ఆమోదం
ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు మంత్రివర్గ ఆమోదం
ఏప్రిల్ నుంచి వర్తించేలా రూ.4 వేల పెన్షన్ పెంపునకు క్యాబినెట్ ఆమోదం... పెండింగ్ బకాయిలు కలిపి జులై 1న ఇంటివద్దే రూ.7 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గ ఆమోదం
రాష్ట్రంలో గంజాయి కట్టడికి హోంమంత్రి నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ... 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లా అండ్ ఆర్డర్, పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, మద్యం అంశాలపై శ్వేతపత్రాల విడుదల
వైద్య ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ