అమరావతిలో అసెంబ్లీ కూడా దండగే : మంత్రి కొడాలి నాని
పేదలకు స్థానంలేని అమరావతిలో అసెంబ్లీ కూడా దండగేనని వైకాపా ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయమని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసి తీరుతామని ఆయన ప్రకటించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పేదలకు స్థానంలేని రాజధాని అమరావతితో ప్రయోజనం లేదన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయమని... ఆ పని ఖచ్చితంగా చేసి తీరుతామన్నారు. ప్రజలకు ఉపయోగం లేని అమరావతిలో చట్టాలు చేసే అసెంబ్లీ ఉండటం కూడా దండగేనని వ్యాఖ్యానించారు.
ఇకపోతే, రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ అదృశ్యం వెనుక టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు హస్తముందన్నారు. స్పష్టంగా చెప్పాలంటే డాక్టర్ రమేష్‌ను చంద్రబాబే తన ఇంట్లో దాచిపెట్టారని మంత్రి నాని సంచలన ఆరోపణలు చేశారు. తప్పు చేయకపోతే రమేశ్ ఎందుకు పారిపోతారని ప్రశ్నించారు.
ఒక మహిళను ముందు పెట్టి పారిపోవడం దారుణమన్నారు. చంద్రబాబు విషయంలో సినీహీరో రామ్ జాగ్రత్తగా ఉండాలని... ఆయన ట్రాప్‌లో పడరాదని సూచించారు. ఏ సామాజికవర్గంపై కూడా తమ ప్రభుత్వానికి కక్ష సాధించాల్సిన అవసరం లేదని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు.
అమరావతిలో ఉద్యమమే లేదు..
అమరావతిలో అసలు ఉద్యమమే జరడం లేదన్నారు. ఒకవేళ జరిగినా అది అసలైన ఉద్యమమే కాదని.. అక్కడ ప్రజా ఉద్యమమే లేదు.. అదో రియల్ ఎస్టేట్ ఉద్యమం.. కెమెరా ఉద్యమం.. అక్కడ జరిగేది భూస్వామ్య, పెట్టుబడిదారి, ధనవంతుల ఉద్యమం అని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వెల్లడించారు.
చంద్రబాబు మనుషులు కెమెరాల కోసం చేసే అల్లరిని ఉద్యమం అంటే, ఉద్యమం అన్న పేరుకే అది అవమానం అన్నారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. బాబు రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నట్టు భ్రమ కల్పిస్తున్నారని, అది కేవలం టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని వారు ఆరోపించారు.