శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (13:43 IST)

స్వరూపానందేంద్ర స్వామికి రాజధాని సెగ.. టూర్‌ను అడ్డుకున్న మహిళలు

విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి రాజధాని అమరావతి సెగ తాకింది. గుంటూరులో ఉన్న గోరంట్ల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన స్వరూపానందేంద్రకు రాజధాని ప్రాంత మహిళలు చుక్కలు చూపించారు. ఆయన కారుకు అడ్డుగా నిలబడి, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. పైగా, స్వరూపానందేంద్ర స్వామి కూడా అమరావతికి మద్దతు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో వైకాపా నేతలు, పోలీసులు రంగప్రవేశం చేసి స్వామిని సురక్షితంగా ఆలయంలోకి తీసుకెళ్లారు. 
 
కాగా అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తోన్న ఆందోళనలు శుక్రవారానికి 52వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు వెలగపూడి, ఐనవోలు, నవులూరుతో పాటు పలు ప్రాంతాల్లో రైతులు నిరసన తెలుపుతున్నారు. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 52వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడిలో రైతులు 24 గంటల దీక్షలను కొనసాగిస్తున్నారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరుకు వచ్చిన స్వరూపానందేంద్ర స్వామి గుంటూరుకు రావడంతో అమరావతి సెగ తగిలింది.
 
కాగా, స్వరూపానందేంద్ర స్వామికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెల్సిందే. ముఖ్యమంత్రి కాకముందు.. సీఎం అయిన తర్వాత సీఎం జగన్ తరచుగా విశాఖ శారదాపీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం తీసుకుని, గంటల కొద్ది మంతనాలు జరుపుతున్న విషయం తెల్సిందే.