బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (12:21 IST)

ముఖ్యమంత్రి తండ్రిలాంటివాడు.. పిల్లలందరూ వృద్ధి చెందాలి : అమరావతిపై జగన్ కామెంట్స్

రాజధాని అమరావతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రానికి తండ్రిలాంటివాడనీ, అందువల్ల ప్రతి ఒక్కరి బాగోగుల గురించి ఆలోచన చేయాల్సివుందన్నారు. 
 
బుధవారం విజయవాడలో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. 'ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఓ తండ్రిలాంటివాడు. ఒక  తండ్రిలా నిర్ణయం తీసుకున్నాను కాబట్టే అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రతిపాదనలు చేశాం. ఒక ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు రాబోయే తరాల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. ఓ మంచి నిర్ణయం తీసుకోకపోతే రాబోయే తరాల వారి పరిస్థితులను దుర్భరం చేస్తాయి' అని వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, ఏపీ రాజధాని గురించి 'బాహుబలి' వంటి గ్రాఫిక్స్ చూపాలని తాను అనుకోవట్లేదు. 'ప్రజలను మభ్యపెట్టాలని, గ్రాఫిక్స్‌ చూపించాలని నేను అనుకోవట్లేదు. జపాన్, సింగపూర్‌ నగరాలను సృష్టించేంత నిధులు మా దగ్గర లేవని నాకు తెలుసు. నేను ఏం చేయగలనో ఆ వాస్తవాలను మాత్రమే చెబుతున్నాను. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు అందించేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాం. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది' అని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, 'ఉద్యోగాల కోసం మన పిల్లలు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుకు వెళ్లే అవసరం ఉండకూడదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు అమరావతి రాజధాని ప్రకటన ముందే భూములు కొనుగోలు చేశారు' అని వ్యాఖ్యానించారు. 'గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లోనే నం.1 నగరం. అమరావతి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.1.09,000 కోట్లు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్పాయి. ఒకవైపు అమరావతికి రూ.1.09,000 కోట్లు ఖర్చు చేయాలా? లేక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలా? అని ఆలోచించాను' అని జగన్ చెప్పారు.
 
'కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుంది. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం. అలాగే, అమరావతిలోనూ అభివృద్ధి కొనసాగుతుంది. ముఖ్యమంత్రిగా నేను రాబోయే తరం వారికి అన్ని సదుపాయాలు ఇక్కడే కల్పించాలి' అని జగన్ అన్నారు.
 
'ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే ప్రాంతానికి వెళ్లే పరిస్థితి ఉండకుండా చేయాలి. అమరావతిపై రాజకీయాలు చేస్తున్నారు. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. విశాఖ నగరం మన ఊరు, మన నగరం, మన రాజధాని. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ ఉంటుంది. అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం, హెడ్‌వోడీ, సచివాలయం' ఉంటాయి. శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.