గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 20 నవంబరు 2020 (16:34 IST)

నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు డిప్యూటీ సిఎంవే కదా: మంత్రి పెద్దిరెడ్డి

ఇద్దరూ ఎపి కేబినెట్‌లో మంత్రులు. ఒక వ్యక్తి రాజకీయాల్లో తలపండిన వ్యక్తి. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయం నుంచి మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ కాలం పనిచేశారు. మళ్ళీ జగన్ పార్టీ పెడితే ఆ పార్టీలోకి దూకి పెద్దాయనగా పేరు తెచ్చుకున్నాడు. వైసిపిలో జగన్ తరువాత రెండవ పెద్ద నాయకుడిగా కొనసాగుతున్నాడు.
 
ఇదంతా ఒకే.. అయితే డిప్యూటీ సిఎంగా దళిత నేతకు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి. సంవత్సరం నుంచి ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నారాయణస్వామి.. ప్రస్తుతం పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పిందే వినాలి. లేకుంటే ఇక అంతే సంగతులు.
 
ఈయనొక్కరే కాదు. చిత్తూరు జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే. ఒక్క రోజా తప్ప. ఆమె మాత్రం వాళ్ళ మాట అస్సలు వినరనే విమర్శలున్నాయి. ఆమె రూటు సపరేటు కదా. సరే ఇదంతా పక్కనపెడితే నిన్న తిరుపతి ఎంపి స్థానానికి అభ్యర్థి కోసం సిఎంతో సమావేశం జరిగింది. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు పంచాయతారాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిగిలిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
 
సమావేశం తరువాత మీడియాకు వివరణ ఇచ్చేందుకు మీడియా పాయింట్ వద్దకు వచ్చారు. అయితే పెద్దిరెడ్డి మాత్రం దూరంగానే ఉన్నారు. నారాయణస్వామి స్టేజ్ పైకి వెళ్ళారు. పెద్దిరెడ్డి రాకపోయే సరికి సర్.. మీరు రండి సర్ అంటూ పిలిచారు. అయితే పెద్దిరెడ్డికి కోపమొచ్చింది. 
 
బుద్ధి, జ్ఙానం ఉందా నీకు.. డిప్యూటీ సిఎం కదా నువ్వు మాట్లాడు అంటూ చేతులు పట్టుకుని మైకు ముందుకు తోశారు. దీంతో ఒక్కసారిగా స్థానికంగా ఉన్న నేతలే ఆశ్చర్యపోయారు. ఒక సీనియర్ మంత్రి ఒక దళిత నేతపై ఈ విధంగా ప్రవర్తించడంపై ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడిదే వైసిపిలో చర్చకు కారణమవుతోంది.