బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (10:17 IST)

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు... 2,786 సర్పంచ్ పోస్టులు, 20,817 వార్డులకు పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడత గ్రామాల్లో మొత్తంగా 2,786 గ్రామ పంచాయతీ సర్పంచి స్థానాలకు గానూ 7,507 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 20,817 వార్డులకు పోలింగ్‌ జరుగుతుండగా, ఇందుకోసం 44,876 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. 
 
ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 3.30గంటల వరకు కొనసాగనుంది. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ కాగా 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని ఒక్కో గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 2,786 చోట్ల సర్పంచి పదవులకు పోలింగ్‌‌ నిర్వహణ అధికారుల ఏర్పాట్లు చేశారు. కాగా, ఎన్నికలు జరిగే 29,304 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు తదితర సామగ్రితో పోలింగ్‌ సిబ్బంది శుక్రవారం రాత్రికే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు.
 
ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో 4,181 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా, 5,480 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. బ్యాలెట్‌ పేపరుతో ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 18,387 పెద్దవి, 8,351 మధ్యస్థం, 24,034 చిన్న సైజు బ్యాలెట్‌ బాక్స్‌లను వినియోగిస్తున్నారు. పోలింగ్‌ విధుల్లో 81,327 మంది సిబ్బంది పాల్గొంటుండగా 4,385 మంది జోనల్‌ అధికారులు, రూట్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 9,661 కేంద్రాలలో ప్రత్యేక వెబ్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు.
 
ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనుండగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు పోలింగ్‌ సమయంగా నిర్ణయించారు. కోవిడ్‌ పాజిటివ్‌ బాధితులకు పోలింగ్‌ చివరిలో గంట పాటు కరోనా జాగ్రత్తలతో ఓటు వేసేందుకు అనుమతిస్తామని ఎస్ఈసీ అధికారులు తెలిపారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ తమ కార్యాలయాల నుంచి ఎన్నికలను పర్యవేక్షించనున్నారు.
 
ఇక, పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి లెక్కింపు ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బ్యాలెట్‌ బాక్స్‌లను నిర్దేశిత ప్రాంతానికి తరలించి తొలుత వార్డులకు తర్వాత సర్పంచి ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. పోలింగ్‌ అనంతరం ఓట్ల లెక్కింపు వెంటనే చేపడుతున్న నేపథ్యంలో రెండు వేర్వేరు గదుల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, ఇతరులు బ్యాలెట్‌ పేపర్లు తాకకుండా బారికేడ్లతో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశించింది.