శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 23 మే 2018 (16:32 IST)

బీజేపికి ఇంకా బుద్ధి రాలేదా? వైసీపి ఇక్కడ బైబిల్ పట్టుకుని... జూపూడి ప్రభాకర రావు

అమరావతి: దేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి, లౌకిక స్వరూప రక్షణకు ప్రార్థనలు చేయమన్న ఢిల్లీలోని ఆర్చిబిషప్ అనీల్ కౌంట్ జోసఫ్ లేఖపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని టీడీపీ ఖండిస్తున్నట్లు ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్

అమరావతి: దేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి, లౌకిక స్వరూప రక్షణకు ప్రార్థనలు చేయమన్న ఢిల్లీలోని ఆర్చిబిషప్ అనీల్ కౌంట్ జోసఫ్ లేఖపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని టీడీపీ ఖండిస్తున్నట్లు ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు తెలిపారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్‌లో బుధవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. వివిధ మతాలు, భాషలు, కులాలు, వర్గాలు ఉన్న భారతదేశ లౌకిక స్వరూపానికి ఆయన వ్యాఖ్యలు  ప్రమాదకరం అన్నారు. 
 
ఈ దేశంలో అట్టడుగున ఉన్న అనేక వర్గాలు రాజకీయంగా అభివృద్ధి చెందలేదన్నారు. అందరూ సమానంగా అభివృద్ధి చెంది కుల రహిత సమాజం ఏర్పడాలన్నదే డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ లక్ష్యంగా పేర్కొన్నారు. ఆ విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. గాయపడ్డ హృదయాలు, వ్యక్తులు, సంస్థలు గొంతెత్తి మాట్లాడతాయని, అందులో భాగంగానే జోసఫ్ దేశం కోసం ప్రార్థనలు చేయమన్నారని చెప్పారు. అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. 2019లో ఏర్పడే ప్రభుత్వం అన్నారేగాని, ఏ ప్రభుత్వమో ఆయన ప్రస్తావించకపోయినా అమిత్ షా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని, ఆయనకు భయం ఎందుకని ప్రశ్నించారు. కుల, మత, వర్గ వివక్షలేదని ఆయన చెబుతున్నారని, అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ పేరుతో వివక్ష కొనసాగుతుందన్నారు. క్రైస్తవులు శాంతికాముకులని, వారు ప్రార్ధనలు మాత్రమే చేస్తారని చెప్పారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ, టీడీపీ నేతలు గానీ ఎవరూ జోసఫ్ వ్యాఖ్యలపై మాట్లాడలేదని, అయినా మత ప్రాతిపదికన ప్రజలను సమీకరించడం సరికాదని అమిత్ షా అనడంలో అర్థంలేదన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని మతాలు, కులాల వారు ఎదగాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా పేర్కొన్నారు. ఎస్సీలతో సమానంగా దళిత క్రైస్తవులకు కూడా సౌకర్యాలు కల్పించాలని ఏప్రిల్ 14న తీర్మానం చేశారని గుర్తు చేశారు. 
 
భారత రాజ్యాంగానికి కట్టుబడిన లౌకికవాద రాజకీయ పార్టీ టీడీపీ అని చెప్పారు. బిజేపీని మతమౌఢ్యంతో సామ్రాజ్యవాద కాంక్షతో వ్యవహరించే పార్టీగా పేర్కొన్నారు. మతవాదులుగా ముద్రపడితే మీకే నష్టం అని ఆయన బిజేపీ నేతలను హెచ్చరించారు. ప్రభుత్వాలకు సేవాదృక్పదం ఉండటం అవసరం అన్నారు. కర్నాటక ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు చెక్ పెట్టినా బీజేపీకి బుద్ధిరాలేదా అని ప్రశ్నించారు. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ డబ్బుని విచ్చలవిడి ఖర్చుచేసిందని, గిరిజనులను రెచ్చగొట్టిందని ఆరోపించారు.
 
ప్రజాస్వామ్యవాదులను ఒకటిగా చేయడం కోసం చంద్రబాబునాయుడు చేసే ప్రయత్నాలను చూసి బీజేపీ సహించలేకపోతోందన్నారు. రాజ్యాంగానికి విలువ ఇస్తూ సమసమాజ సిద్ధాంతం కోసం టిడిపి పని చేస్తుందన్నారు. తమ పార్టీ ఒక మతానికి, ఒక వర్గానికి కొమ్ముకాయదని స్పష్టం చేశారు. బిజేపీ వికృత క్రీడలకు నాయకత్వం వహిస్తోందని విమర్శించారు. ఆ పార్టీకి గడ్డు కాలం వచ్చిందన్నారు.
 
వైఎస్ఆర్ సీపీ నేతలు ఇక్కడ బైబిల్ పట్టుకొని తిరుగుతారని, ఢిల్లీలో బైబిల్‌కు వ్యతిరేకులతో చేయి కలుపుతారని విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ వైఖరి తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసుల నుంచి బయటపడటానికి ఆ పార్టీని బీజేపీలో కలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ క్రైస్తవులకు అండగా ఉంటుందని జూపూడి చెప్పారు.