ఎస్వీబీసీ ఛైర్మన్‌గా రాఘవేంద్రుడు మాకొద్దు బాబోయ్ అంటున్నారు...ఎవరు..?
దర్శకుడు రాఘవేంద్రరావును ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ఎస్వీబీసీ అవకతవకలపై హైకోర్టులో కేసు నడుస్తుండడం, అవినీతికి కారణమైన మాజీ సీఈఓ నరసింహారావుకు రాఘవేంద్రరావు అండదండలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా అ
దర్శకుడు రాఘవేంద్రరావును ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ఎస్వీబీసీ అవకతవకలపై హైకోర్టులో కేసు నడుస్తుండడం, అవినీతికి కారణమైన మాజీ సీఈఓ నరసింహారావుకు రాఘవేంద్రరావు అండదండలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా అదే ఎస్వీబీసీకి ఛైర్మన్‌గా దర్శకేంద్రుడ్ని నియమించడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాలకు కేరాఫ్‌గా టిటిడి మారుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో వివాదం రాజుకుంటోంది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్‌గా దర్శకుడు, మాజీ టిటిడి పాలకమండలి బోర్డు సభ్యులు రాఘవేంద్రరావు నియామకంపై భగ్గుమంటున్నాయి హిందూ ధార్మిక సంఘాలు. ఇప్పటికే ఎస్వీబీసీ వ్యవహారాలకు సంబంధించి అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా టిటిడి విజిలెన్స్, నిఘా విభాగం ఈ అవినీతి తతంగంపై విచారణ జరిపి హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
ఇదే విషయంపై హైకోర్టులో విచారణ కూడా కొనసాగుతోంది. ఈ అవినీతికి ప్రధాన కారణం మాజీ సిఈఓ నరసింహారావు ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఉద్వాసన పలికింది ప్రభుత్వం. అయితే టిటిడి పాలకమండలి సభ్యులుగా రాఘవేంద్రరావు ఉన్న సమయంలోనే సిఈఓగా ఉన్న నరసింహారావు రెచ్చిపోయారంటూ గతంలో ఉద్యోగులే ఆరోపించారు. అయితే రాఘవేంద్రరావుకు సిఎం చంద్రబాబునాయుడుతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా విజిలెన్స్ అధికారులు ఆయన్ను ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయారు.
ఈ నేపథ్యంలో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా తాజాగా రాఘవేంద్రునికి ఎస్వీబీసీ బోర్డు ఛైర్మన్‌గా పదవిని కట్టబెట్టడం దుమారాన్ని రేపుతోంది. ఎస్వీబీసీ అవినీతికి సూత్రధారిగా ఉన్నాడన్న ఆరోపణలు వచ్చిన వ్యక్తికే ఛైర్మన్ పీఠం కట్టబెట్టడంపై భక్తులతో పాటు హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇప్పటికే టిటిడి పాలకమండలిలో అన్యమతస్తులకు చోటు కల్పించారన్న వివాదం రేగుతున్న సమయంలోనే ఆధ్మాత్మిక ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న ఎస్వీబీసీ ఛానల్‌ను వివాదాస్పద వ్యక్తికే కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది.
గతంలో రాఘవేంద్రరావు తన సొంత నిర్మాణ సంస్థ కె.ఆర్.ఆర్. ఈవెంట్స్ ద్వారా పలు సీరియళ్ళను తీసి వాటిని అధిక ధరలకు ఎస్వీబీసీకి కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే సీరియళ్ళ నాణ్యత సరిగా లేదంటూ మళ్ళీమళ్ళీ వాటిని రీ-షూటింగ్ చేసి వాటిని అదనంగా డబ్బులు దండుకున్నారన్న విమర్శలున్నాయి.
అంతేకాకుండా ఎస్వీబీసీ కార్యక్రమాలకు సంబంధించి బిల్లుల చెల్లింపులలోను రాఘవేంద్రరావు అండదండతోనే సిఈఇగా ఉన్న నరసింహారావు అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వివాదం జరుగుతున్న నేపథ్యంలో రాఘవేంద్రరావును ఎస్వీబీసీకి దూరంగా ఉంచుతారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే అవేవీ పట్టించుకోకుండా ఈసారి ఏకంగా రాఘవేంద్రరావును ఎస్వీబీసీ ఛైర్మన్‌గా చేయడంపై అవాక్కవుతున్నారు భక్తులు. దర్సకేంద్రుడుని ఆ పదవి నుంచి తొలగించేంత వరకు న్యాయపోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు హిందూ ధార్మిక సంఘాలు.