ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (08:28 IST)

అప్పులు చెల్లించడానికి అదనపు పన్నులా?: డాక్టర్ సాకే శైలజానాథ్

కరెంటు బిల్లులు, చెత్తపన్ను, ఆస్తిపన్ను, మద్యంపై అదనపు పన్నులు, పెట్రోల్, డీజిల్పై పన్నుల రూపంలో రాష్ట్ర ప్రజల జేబులు గుల్ల చేస్తోందని  ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆరోపించారు. ప్రజల నిత్యావసరాలను గమనించి మరీ వాటి ద్వారా ఆదాయం పిండుతోందని, అలా పెరిగిన ఆదాయం కూడా చాలక కేంద్రం కాళ్లావేళ్లా పడి కొత్తగా వేల కోట్ల అప్పులు చేస్తోందని మండిపడ్డారు.

చేసిన వేల కోట్ల అప్పులు ఎటు వెళ్తున్నాయో తెలీదుగానీ ఈ అప్పులు చెల్లించడం కోసమే అదనపు పన్నులు వేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు.  2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు 9 నెలల కాలానికి రూ.20,750 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతించింది.

ఈ మొత్తం పరిమితిని కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేశారు. ఇది కాకుండా ఏపీ ఎస్ డీసీ, ఏపీ రోడ్డు అభివృద్ధి సంస్థ, ఆర్థిక సేవల పేరుతో ఏర్పాటు చేసిన ఎన్బీఎ్ఫసీతోపాటు పలు ఇతర కార్పొరేషన్ల ద్వారా వేలకోట్లు అప్పు తెచ్చుకున్నారు. కేంద్రాన్ని బతిమాలి, బామాలి అదనంగా రూ.10,500 కోట్లు అప్పులకు అనుమతి తెచ్చుకుని అందులో రూ.3వేల కోట్లు కేవలం వారంలోనే వాడేస్తున్నారు.

గత 14 నెలలుగా ఓవర్ డ్రాఫ్ట్కు వెళితేకానీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి. ఆగస్టు నెలలో రాష్ట్రానికి ఎక్కడా అప్పు పుట్టలేదు. సెప్టెంబరులో ఇచ్చిన వేతనాలను కూడా ఆర్బీఐ నుంచి ఓడీ తీసుకుని ఇచ్చారు. అప్పటికి కొత్తగా అప్పులు చేసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతించలేదు.  కానీ, ఈ నెల మూడో తేదీన కొత్తగా రూ.10,500 కోట్లు అప్పు చేసుకునేందుకు అనుమతిస్తూ కేంద్రం లేఖ పంపిందన్నారు.

వెంటనే ఆర్బీఐ ద్వారా బాండ్లు వేలం వేసి రూ.2,000 కోట్లు అప్పు తెచ్చారు. ఆ అప్పును ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు ఆర్బీఐ వద్ద ఓడీ రూపంలో తీసుకున్న అప్పు కింద జమ చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో దాదాపు రూ.2,68,835 కోట్ల అప్పు చేయగా అందులో రూ.1.05లక్షల కోట్లను ప్రజలకు పంచినట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించారు.

కానీ వాస్తవ పరిస్థితుల్లో తీసుకొచ్చిన మొత్తం అప్పులో కేవలం 25.50% మాత్రమే అంటే కేవలం రూ.68,632 కోట్లు మాత్రమే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో ప్రజలకు పంచారన్నారు. మిగిలిన రూ.1.99 లక్షల కోట్లు (74.50%) ఏం చేశారు.? అనే ప్రశ్నకు ప్రభుత్వం నుండి సమాధానం లేదన్నారు.

గత రెండున్నరేళ్లలో కేపిటల్ ఎక్స్ పెండించర్ కోసం ఖర్చు చేసింది రూ.31వేల కోట్లు మాత్రమే. లెక్కల్లో చూపని రూ.1.99 లక్షల కోట్లలో రూ.31వేల కోట్లు తీసేసినా ఇంకా రూ.1.68 లక్షల కోట్లకు సంబంధించిన లెక్కలెక్కడ.? ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేసినట్లు.? ఎవరి జేబుల్లోకి మళ్లించినట్లు.? ఒకవేళ ఆ నిధులను రెవెన్యూ కోసం ఖర్చు చేసినా అది ఆర్ధిక నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుందన్నారు.

గత బడ్జెట్ లెక్కల ప్రకారం సంక్షేమం కోసం రూ.68,632 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఖర్చును పరిశీలిస్తే సంక్షేమం కోసం చేసిన ఖర్చులో దేశంలో 19వ స్థానంలో ఉన్నాం. దీంతో ఆర్ధిక మంత్రి చెప్పిన రూ.1.05 లక్షల కోట్ల ఖర్చు కూడా అబద్దమేనని అర్థమవుతోందన్నారు. 

ఇప్పటిదాకా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, బిల్లులు అన్నీ ఆపి  వేసి అభివృద్ధి పనులను అటకెక్కించి  అప్పులు తెచ్చి మరీ పథకాలకు డబ్బులు ఇస్తూ వచ్చారన్నారు. ఇలా అప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని ఎన్నాళ్ళు నడుపుతారని శైలాజానాథ్ ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.