శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 24 జనవరి 2020 (18:23 IST)

సీఎం జగన్‌కు రెండో షాక్... వ్యక్తిగత మినహాయింపుకు నో...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈడీ కోర్టు షాకిచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ముఖ్యమంత్రి అయినప్పటికీ జగన్ విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు పిటీషన్ కొట్టివేతతో సీఎం జగన్ న్యాయస్థానానికి హాజరవ్వాల్సి వుంటుంది.
 
గతంలో అక్రమాస్తుల కేసులో ఏ1గా ఉన్న నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, ఏ2గా విజయసాయి రెడ్డిలు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. జగన్మోహన్ రెడ్డితో పాటు.. విజయసాయిరెడ్డిపై పలు అక్రమాస్తుల కేసులు నమోదైవున్న విషయం తెల్సిందే. 
 
ఈ కేసులో జగన్‌ ముఖ్యమంత్రి కాక మునుపు ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరవుతూ వచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత విచారణకు సీఎం జగన్ మినహాయింపు కోరుతూ వచ్చారు. ఐతే సీబీఐ కోర్టు దానికి నో చెప్పడంతో ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇపుడు ఈడీ కోర్టు కూడా సీఎం హాజరు కావాల్సిందేనంటూ తేల్చి చెప్పింది.