గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (19:32 IST)

పేద బ్రాహ్మణులకు సహాయం చేసేవారికి శంకరాచార్యుల దీవెనలు: మంత్రి పేర్ని నాని

పౌరోహిత్యం మినహా మరో వ్యాపకం తెలియని సరస్వతీ పుత్రులు బ్రాహ్మణులని, నాలుకపై సరస్వతీ దేవి నర్తనం మినహా జేబులో ధనలక్ష్మీ దర్శనం లేని అత్యధిక శాతం మంది బ్రాహ్మణులు ఆర్ధిక పరిస్థితి నేడు ఎంతో దయనీయంగా ఉందని , అటువంటి వారిని గుర్తించి సహాయపడటం ఎంతో గొప్ప భాగ్యమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. 

మంగళవారం మచిలీపట్నం గొడుగుపేటలో శంకరమఠం పక్కన శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ  సందర్భంగా  విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి ఆధ్వర్యంలో  206 మంది బ్రాహ్మణ కుటుంబ సభ్యులకి రెండు మామిడి పళ్ళు 500 రూపాయలు తాంబూలం అందచేశారు. 

అంతేకాక వారందరికీ  200 రూపాయలు, వైదిక ధర్మ ప్రవర్తన సంఘ దాతల సహాయ సహకారాలతో  విష్ణుభట్ల సూర్యనారాయణ చేతుల మీదగా మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని పలువురికి అందచేశారు. 

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ,  పౌరోహిత్యం గానీ , ప్రభుత్వం గుర్తించిన అర్చకుడిగానీ, మంత్రోచ్ఛారణ చేస్తున్న బ్రాహ్మణులెవరూ ఆకలితో ఉండరాదని భావించి  విష్ణుభట్ల సూర్య నారాయణ శర్మ ఘనాపాటి  ఈ వితరణ కార్యక్రమానికి బాధ్యత తీసుకోవడం ఎంతో సంతోషమని అన్నారు. 

గత నెల రోజులుగా పంటి బిగువన ఎందరో బ్రాహ్మణోత్తములు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారికి రానున్న మరి కొద్ది రోజులు లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా వారు  ఆర్ధిక భారం,  ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా కొంత ఆర్ధిక సహాయం చేయడం ఎంతో మంచి చర్యని అన్నారు. 

ఎవరైనా ఇక్కడకు వచ్చి అందరిలో  ఈ సహాయం తీసుకోవడానికి మొహమాట పడి,  ఆత్మాభిమానం అడ్డు వస్తే, ఫోన్ ద్వారా లేదా ఎవరినైనా తెల్సిన వ్యక్తితో సందేశం పంపితే వారికి ఘానాపాటి సరకులను నేరుగా వారి ఇంటికి పంపేందుకు సైతం   విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి  బాధ్యత తీసుకున్నారన్నారు.

కరోనా కష్టకాలంలో పేద, మధ్యతరగతి బ్రాహ్మణులకు సహాయం చేసేందుకు పెద్ద మనస్సుతో ముందుకొచ్చిన దాతలకు ఆ శంకరాచార్యుల దీవెనలు మెండుగా లభించి వారి ఆర్ధిక శక్తీ మరింతగా వృద్హి చెందాలని కోరుకొంటున్నట్లు మంత్రి పేర్ని నాని కోరుకున్నారు. 

మానవాళి సుభిక్షంగా ఉండేందుకు , మానవాళిని సక్రమమైన మార్గ నిర్దేశం చేయడానికి ఆది శంకరాచార్యుల వారు అవతరించారని అన్నారు. 32 సంవత్సరాల వయస్సులో కాలి నడకన భారతదేశం మొత్తం హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు , పూరి జగన్నాధుని ఆలయం నుండి ద్వారకా వరకు  2 సార్లు  సందర్శించారణని అన్నారు.

భారతదేశంలో ప్రతి మారుమూల శంకరాచార్యుల పాద ధూళితో పులకించండని అన్నారు. శ్రీ ఆది శంకరాచార్యుల వారు భారతావని లో జన్మించి మానవాళికి మహోపకారం చేసారని  అతి క్లిష్టమైన వేదాంత విషయాల్ని ఒకపక్క వివరించి, మరొకపక్క పరమ పవిత్రమైన నాలుగు పీఠాలను భారత దేశపు నాలుగు దిక్కులా స్థాపించి , మరొకపక్క ఆధ్యాత్మిక లోకపు సరిహద్దులలోకి పయనించేందుకు మెట్లుగా, సులువైన త్రోవలు మాదిరిగా ఎన్నో స్తోత్రాలు, స్తుతులు, అష్టకాలు, రచించి అన్నీ మానవుల ఎదుటపెట్టి చదువుకొని తరించండి అని దీవించిన కారణజన్ములని  ప్రస్తుతించారు. 

ఆది శంకరాచార్యుల వారి జయంతి రోజున ఆ మహనీయుని స్మరించుకొని పూజించుకునే భాగ్యం కల్పించిన  విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటికు ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు.