ఓటుకు నోటు కేసు : చంద్రబాబు నిద్రలేని రాత్రి.. హైకోర్టు దిశగా అడుగులు
తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన ఓటుకు నోటు కేసును పునర్విచారణ జరపాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రలేని రాత్రి గడిపినట్టు సమాచారం
తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన ఓటుకు నోటు కేసును పునర్విచారణ జరపాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రలేని రాత్రి గడిపినట్టు సమాచారం. ఈ కేసును మళ్లీ విచారణ జరపి, నెల రోజుల్లో నివేదిక సమర్పించాలంటూ ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయంతెల్సిందే.
దీంతో తనపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే ఏం చేయాలన్న దానిపై ఏపీ ఇంటెలిజెన్స్, న్యాయ సలహాదారులు తదితరులతో ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం రాత్రి సమయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేస్తే ఎలాగైనా విచారణను ఆపించేందుకు ప్రయత్నించాలని, ఇందుకు ఉన్న మార్గాలపై బుధవారం ఉదయానికల్లా తనకు చెప్పాలని ఆదేశించారని తెలుస్తున్నది.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత హైకోర్టు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా చంద్రబాబు ఆదేశించారని సమాచారం. ఓటుకు నోటు కేసు బయటకు వచ్చిన సమయంలో ఏర్పాటుచేసిన సిట్‌ను మళ్లీ రంగంలోకి దించడం, ట్యాపింగ్ అంశాన్ని మళ్లీ ముందుకు తేవడంతోపాటు రాజకీయంగా ఎదురుదాడి చేసేలా కూడా వ్యూహాలు రచించాలని అధికారులకు, తన ఆంతరంగికులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.