గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 నవంబరు 2024 (11:47 IST)

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

rajinikanth
సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆత్మకథను రాయనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిని రజనీకాంత్ టీమ్ స్పందించనూ లేదు ఖండించనూ లేదు. దీంతో రజనీకాంత్ ఆత్మకథ పుస్తక రూపంలో రానుందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతుంది. 
 
ప్రస్తుతం రజనీకాంత్ వరుస హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ, వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. 'జైలర్‌', 'వేట్టయన్' వంటి చిత్రాల ఘన విజయాన్ని సాధించిన రజనీకాంత్ ఇపుడు "కూలీ" చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత "జైలర్-2"లో నటించనున్నారు. ఈ చిత్రాలు పూర్తయిన తర్వాత తన ఆత్మకథ (ఆటో బయోగ్రఫీ) రాయనున్నారని ప్రచారం జరుగుతోంది. 
 
అయితే ఈ విషయంపై రజనీకాంత్ టీమ్ నుంచి ఇంత వరకూ ఎటువంటి స్పందన రాలేదు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వార్తను ధృవీకరించడం గానీ, ఖండించడం గానీ చేయలేదు. అయితే రజనీకాంత్ తన ఆత్మకథను రాయబోతున్నారు అన్న వార్తే అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. సూపర్ స్టార్‌గా ఎదిగినా చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ ఎంతో మంది అభిమానులను రజనీకాంత్ సంపాదించుకున్నారు. 
 
ఆయనకు భారతదేశంలోనేకాక జపాన్ తదితర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ పేరుతో ఫ్యాన్స్ క్లబ్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం చాలా మందికి రజనీకాంత్ సినీ కేరియర్ గురించి మాత్రమే తెలుసు కానీ, వ్యక్తిగత విషయాలు మాత్రం ఎవరికీ పెద్దగా తెలియవు. కాకపోతే బస్ కండక్టరుగా తొలుత జీవనాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఓ స్నేహితుడి సలహాతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారని మాత్రం చాలా మందికి తెలుసు. 
 
దక్షిణాది చిత్రాలతో పాటు హిందీలోనూ రజనీకాంత్ నటించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా రజనీకాంత్ ఆత్మకథ రాస్తే అభిమానులకు మంచి గిఫ్ట్ అందుతుందని భావిస్తున్నారు. ఇక రజనీకాంత్ చివరిసారిగా 'వేట్టయన్' మూవీలో అభిమానులకు కనువిందు చేశారు.