మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 మే 2023 (08:19 IST)

కర్నూలు విశ్వభారత ఆస్పత్రికి సీబీఐ అధికారులు... ఏ క్షణమైనా అరెస్టు...

avinash reddy
వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప సిట్టింగ్ ఎంపీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న కుమారుడు, తనకు వరుసకు తమ్ముడు అయిన వైఎస్ అవినాశ్ రెడ్డి వ్యవహారంలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. అవినాశ్ తల్లి లక్ష్మమ్మ చికిత్స పొందుతున్న కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి చేరుకున్నారు. 
 
ఇటీవల అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు వచ్చిందని ఆమెను విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. గత నాలుగు రోజులుగా అవినాశ్ రెడ్డి అక్కడే ఉంటున్నారు. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు పంపగా, తాను సోమవారం విచారణకు రాలేనంటూ అధికారులకు లేఖ రాశారు. 
 
ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులే ఆసుపత్రికి చేరుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనను ఏక్షణమైనా అరెస్టు చేస్తారేమోనని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఇక ఆసుప్రతి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. 
 
మరోవైపు వైకాపా కార్యకర్తలు అవినాశ్ రెడ్డి ఉంటున్న ప్రాంతానికి భారీగా తరలివస్తున్నారు. అయితే పోలీసులు అక్కడి నుంచి వారిని దూరంగా పంపేస్తున్నారు. మరోవైపు, ఆదివారం రాత్ర కర్నూలు నగరంలో ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. విశ్వభారతి ఆసుపత్రి వద్ద విధి నిర్వహణలో ఉన్న పలువురు మీడియా ప్రతినిధుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారు. వారిని బూతులు తిట్టారు. అక్కడే పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ మిన్నకుండిపోయారు.