శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

అవినాశ్ రెడ్డి తల్లిని కర్నూలు ఆస్పత్రిలోనే ఎందుకు అడ్మిట్ చేశారు?

YS Avinash Reddy
వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప సిట్టింగ్ వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి.. సీబీఐతో దాగుడు మూతలు ఆడుతున్నారు. ఈ నెల 19 తేదీన శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిన ఆయన డుమ్మాకొట్టారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేదంటూ హైదరాబాద్ నుంచి నేరుగా పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు. అయితే, అనారోగ్యానికి గురైన తల్లిని హైదరాబాద్ నగరంలో కూడా కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
సాధారణంగా రాయలసీమ ప్రాంత వాసులు అనారోగ్యానికి గురైతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లేదా బెంగళూరుకు తీసుకెళ్తుంటారు. కానీ, అవినాశ్ తన తల్లిని అనూహ్యంగా కర్నూలుకు తీసుకొచ్చి విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించడం చర్చనీయాంశమైంది. విశ్వభారతి ఆసుపత్రి అధినేత డాక్టర్ కాంతారెడ్డి అల్లుడైన డాక్టర్ హితేష్ రెడ్డి స్వగ్రామం పులివెందుల సమీపంలోని సింహాద్రిపురం. 
 
హితేష్ రెడ్డికి అవినాశ్ రెడ్డితో స్నేహంతోపాటు దూరపు బంధుత్వం కూడా ఉంది. దీంతోపాటు విశ్వభారతి ఆసుపత్రిలో జనరల్ ఫిజీషియన్‌కు సీఎం కార్యాలయంలో మంచి పరిచయాలున్నాయి. అక్కడి నుంచి వచ్చిన సూచన మేరకు కర్నూలు ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. పైగా, కొందరు న్యాయవాదులు శుక్రవారం ఉదయమే ఆసుపత్రికి వచ్చి పరిశీలించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నానికి ఆమె అనారోగ్యానికి గురికావడం ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించడం, అవినాశ్ రెడ్డి హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్లిపోవడం అంతా గంటల్లో జరిగిపోయింది.