సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

బుద్ధిలేనివాళ్లు రెండు రాష్ట్రాలను కలుపుతామంటున్నారు.. చంద్రబాబు ధ్వజం

chandrababu
రాష్ట్ర విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోమారు స్పందించారు. కొందరు బుద్ధిలేనివాళ్లు, మతి చెడిన వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలను మళ్లీ కలుపుతామంటూ కారు కూతలు కూస్తున్నారని, జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరూ అలా మాట్లాడరని అన్నారు.
 
ఖమ్మం వేదికగా టీడీపీ ఆధ్వర్యంలో శంఖారావం పేరిట బుధవారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. ఇందులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. తాను తెలంగాణ ప్రజల నుంచి అధికారం కోరుకోవడం లేదని కేవలం అభిమానం మాత్రం చాలన్నారు. 
 
ఉమ్మడి ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినా వాటి పాటికి అవి పని చేసుకుంటూ వెళితే దేశానికే ఆదర్శంగా నిలుస్తాయన్నారు. అయితే, కొందరు బుద్ధిలేనివాళ్లు, మతి చెడినవారు రెండు రాష్ట్రాలను కలుపుతామంటున్నారని, జ్ఞానం ఉన్న ఏ ఒక్కడూ అలా మాట్లాడరని అన్నారు. 
 
ఏపీలో పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. ఆ రాష్ట్ర పాలనను గాడిలో పెట్టి, అక్కడి ప్రజలను ఆదుకుంటానని చెప్పారు. కాసాని జ్ఞానేశ్వర్ వంటి నేతలను తయారు చేసి తెలంగాణాలోనూ టీడీపీని బలోపేతం చేస్తామన్నారు. తెలంగాణాలోనూ టీడీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పారు. 
 
తెలంగాణాలో ప్రాజెక్టులు తీసుకొచ్చిందని టీడీపీ అని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది మన పార్టీయేనని చంద్రబాబు మరోమారు పునరుద్ఘాటించారు. అందువల్ల ఓటు అడిగే హక్కు అందరికంటే టీడీపీకే ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు.
 
నిజానికి తెలంగాణాలో టీడీపీకి ఒక్క ఎంపీ లేదా ఎమ్మెల్యే లేరన్నారు. కానీ, ఎవరూ లేకపోయినా ఈ రోజు ఖమ్మం సభకు తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే ఎంతో ధైర్యం కలుగుతుందన్నారు. తెలంగాణాలో టీడీపీ నేతలు ఇప్పటివరకు చురుగ్గా లేరని, ఈ సభను చూసైనా వారు క్రియాశీలకంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుందని ప్రశ్నించే వాళ్ళకు ఖమ్మం సభే సరైన సమాధానమన్నారు. 
 
ఈ సభకు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చారన్నారు. టీడీపీ జెండా పట్టుకుని పార్టీ రుణం తీర్చుకుంటామని యువత ముందుకు వచ్చారని తెలిపారు. టీడీపీ 40 యేళ్లు పూర్తి చేసుకుని భవిష్యత్తుకు నాంది పలకబోతుందన్నారు. తాను కోరుకున్నది అధికారం కాదని, ప్రజల అభిమానం అని అన్నారు. ఎన్నికలు, ఓట్ల కోసం ఎపుడూ పని చేయలేదని స్పష్టం చేశారు. మీ ఆత్మబంధువుగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చంద్రబాబు చెప్పారు.